శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 12:17:04

ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్‌ సత్యవతి కన్నుమూత

ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్‌ సత్యవతి కన్నుమూత
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌ సిటీబ్యూరో/ హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆకాశవాణి మాజీ న్యూస్‌రీడర్‌ మాడపాటి సత్యవతి (80) బుధవారం హైదరాబాద్‌ పద్మారావునగర్‌లోని ఆమె నివాసం లో కన్నుమూశారు. సత్యవతి మృతికి సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాలపాటు తన సుస్వరంతో రేడియోలో వార్తలు చదువుతూ తన హితులు, సన్నిహితులు మాత్రమే కాకుండా లక్షలమంది శ్రోతల హృదయాల్లో ఆమె సుస్థిరస్థానం సంపాదించుకున్నారని గుర్తుచేసుకున్నారు. సత్యవతి పార్థివదేహానికి మధ్యాహ్నం తిరుమలగిరిలోని శ్మశానవాటికలో అంతిమసంస్కారాలు నిర్వహించారు. సత్యవతి హైదరాబాద్‌ నగర మొదటి మేయర్‌ మాడపాటి హనుమంతరావు మనుమరాలు. ఆమె హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. నిజాంకాలంలో తెలుగు చదువడంపై నిషేధం ఉన్నా.. హనుమంతరావు స్థాపించిన తెలుగు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించి ఇతర మహిళలకు, బాలికలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆకాశవాణిలో వార్తలు చదివిన తొలి మహిళా పాత్రికేయురాలిగా అరుదైన రికార్డును నెలకొల్పారు. ఆలిండియా రేడియోలో వార్తా వ్యాఖ్యాతగా, సుదీర్ఘకాలం ఎడిటర్‌గా పనిచేశారు.  


logo