గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:10:57

రికార్డు చూసుకోవాలంటే ఆధార్‌ కచ్చితం

రికార్డు చూసుకోవాలంటే ఆధార్‌ కచ్చితం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒకరి భూమి రికార్డులను మరొకరు చూసే అవకాశం లేకుండా ధరణి పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అప్‌డేట్‌ చేసింది. వ్యక్తిగత  సమాచార గోప్యతను పాటించే దిశగా ఈ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటినుంచి ఒక వ్యక్తికి సంబంధించిన భూమి వివరాలను మరొకరు చూడలేరు. ఎవరి భూముల వివరాలను వారు మాత్రమే ధరణి పోర్టల్‌లో చూసుకోవచ్చు. ఇతరులు చూసుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కట్టుదిట్టం చేశారు. ఒక వ్యక్తి తన భూమి వివరాలు చూసుకోవాలంటే పట్టాదార్‌ పాస్‌పుస్తకం నంబర్‌తో పాటు ఆధార్‌ నంబర్‌ మొదటి నాలుగు డిజిట్లను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చాను ఎంటర్‌ చేస్తే సదరు వ్యక్తికి సంబంధించిన భూ వివరాలు ధరణిలో కనిపిస్తాయి. మొద ట్లో పట్టాదార్‌ పాస్‌ పుస్తకం నంబర్‌ ఎంటర్‌ చేయగానే భూముల వివరాలు వచ్చేవి. దీని వల్ల వ్యక్తిగత భూముల వివరాలు ఇతరులు కూడా చూసే ప్రమాదం ఉందని గుర్తించిన సర్కారు ఈ మేరకు మార్పులు చేసింది. ఎవరైనా ఒక భూమికి సంబంధిచిన వివరాలు చూసుకోవాలంటే జిల్లా, మండల, గ్రామంతోపాటు సర్వే నంబర్‌ ఎంటర్‌ చేస్తే ఆ సర్వే నంబర్‌ వరకు మాత్రమే వివరాలు తెలుస్తాయి. నిషేధిత భూముల వివరాలను మాత్రం ఎవరైనా చూసుకోవచ్చు.