సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:18:13

పురిటినొప్పులను భరిస్తూ.. హోం క్వారంటైన్‌లో ఉన్న మహిళ ప్రసవ వేదన

పురిటినొప్పులను భరిస్తూ.. హోం క్వారంటైన్‌లో ఉన్న మహిళ ప్రసవ వేదన

  • చేతిలో సంచితో ఒక్కో అడుగేస్తూ అంబులెన్స్‌ వద్దకు..
  • అండగా నిలిచిన ఆశా కార్యకర్తలు..
  • రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్‌లో హృదయవిదారక ఘటన

ఎల్లారెడ్డిపేట : ఆమె నిండు గర్భిణి.. పురిటి నొప్పులు వచ్చి తల్లడిల్లిపోతున్నది.. దవాఖానకు తీసుకెళ్దామంటే అత్తకు కరోనా.. ఏదో వాహనాన్ని తీసుకొచ్చి దవాఖానకు తీసుకుపోదామన్నా భర్తకు హోం క్వారంటైన్‌ సంకెళ్లు పడ్డాయి. నొప్పులతో బాధపడుతున్న ఆ తల్లి కన్నతల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి ఎక్కడో ఉన్నాడు. ఆ మహిళ తనే ధైర్యం తెచ్చుకున్నది. ఒక్కోఅడుగు వేసుకుంటూ మొదటి అంతస్తు నుంచి ఒక్కో మెట్టు దిగి కిందికి వచ్చింది. చేతిలో సంచి పట్టుకొని ఆశా కార్యకర్తల వెంట నడుచుకుంటూ వెళ్తుంటే భర్త నిశ్చేష్టుడయ్యాడు. ఈ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ గర్భవతి. ఇటీవల ఓ ఆర్‌ఎంపీ కారులో ఆమెను, ఆమె అత్తను ఎల్లారెడ్డిపేటలోని ఓ దవాఖానకు పరీక్షల కోసం తీసుకెళ్లాడు. ఇదే సమయంలో ఆర్‌ఎంపీ ఓ కరోనా పాజిటివ్‌ వ్యక్తికి చికిత్స అందించాడు. ఆ విషయం తెలిసిన వైద్యాధికారులు ఆర్‌ఎంపీ కాంటాక్ట్‌ లిస్టును సేకరించారు. అందులో వీరుకూడా ఉండడంతో వారి రక్తనమూనాలను పరీక్షించగా గర్భిణీకి నెగెటివ్‌, అత్తకు పాజిటివ్‌ అని తేలింది. దీంతో అత్తను హోం ఐసొలేషన్‌లో ఉంచి, కుటుంబాన్ని హోం క్వారంటైన్‌లో ఉంచారు. గర్భిణి తల్లి మూడేండ్ల క్రితం గుండెపోటుతో మృతిచెందగా, తండ్రి ముంబైలోని కరోనా రెడ్‌జోన్‌ ఏరియాలో ఉన్నాడు. సోమవారం పురిటి నొప్పులు రాగా ఒంటరిగా అంబులెన్స్‌ వద్దకు వెళ్లింది. అందరూ ఉన్నా కరోనా వల్ల ఎవ్వరూ సహాయం లేని పరిస్థితి ఎదురైంది. చేతిలో సంచి పట్టుకుని ఆశ కార్యకర్తల వెంట అంబులెన్స్‌ వరకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.


logo