బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 18, 2020 , 02:12:35

జనం బాధ తెలిసిన ప్రజా సర్కారు

జనం బాధ తెలిసిన ప్రజా సర్కారు

  • దరఖాస్తులు, ధర్నాలు లేకుండానే సవరణ జీవో
  • హామీ మేరకు 24 గంటల్లోనే కోట్ల మందికి ఊరట

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘మా ప్రభుత్వంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా సరిదిద్దుకునే ఆలోచన, సంస్కారం మాకు ఉన్నది. పేద, మధ్య తరగతి ప్రజల పట్ల గౌరవం ఉన్న ప్రభుత్వం మాది. అందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలను 2015 జీవో ప్రకారమే నిర్ధారించేలా రేపు సవరణ ఉత్తర్వులు ఇస్తాం..’ బుధవారం శాసనసభ వేదికగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం గురువారం 131 జీవోను సవరించి తాజాగా 135 జీవోను జారీ చేసింది. గత ప్రభుత్వాల హయాంలో.. సామాన్య ప్రజలు ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తే తప్ప తామిచ్చిన ఉత్తర్వులను సవరించుకునేందుకు సిద్ధపడేవికాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా.. ప్రజలు అడగకముందే ప్రకటించి, అమలుచేస్తున్నది. చివరకు నిబంధనల ప్రకారం వసూలు చేయాల్సిన క్రమబద్ధీకరణ చార్జీలైనా సరే.. ప్రజలకు భారంగా ఉన్నాయని తెలిసిన వెంటనే వాటిని సవరించడం విశేషం. 

ప్రస్తావించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో అక్రమ ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌)ను ప్రభుత్వం గత నెల 30న ప్రకటించింది. వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువునిచ్చింది. ఈ గడువు తీరిన తర్వాత అధికారులు వాటిని పరిశీలించి, క్రమబద్ధీకరణ చార్జీలను లిఖితపూర్వకంగా దరఖాస్తుదారులకు తెలియజేస్తారు. అయితే జీవో వెలువడిన కొద్దిరోజుల్లోనే క్రమబద్ధీకరణ చార్జీలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా కొవిడ్‌ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు క్రమబద్ధీకరణ చార్జీలు భారంగా ఉన్నాయన్న ఆవేదన వ్యక్తమైంది. ఈ విషయాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుర్తించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం సహజం. కానీ రెండు రోజుల కిందట శాసనసభలో అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే కాకుండా మంత్రులు సైతం ప్రజల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం విశేషమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. పైగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి.. ఈ అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే ప్రజలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తూ సవరణ జీవో జారీచేసింది. కాగా, గురువారం నాటికి ఎల్‌ఆర్‌ఎస్‌కు 1.81 లక్షల దరఖాస్తులువచ్చాయి.

లక్షలమందికి ఊరట

రాష్ట్రంలో 146 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతోపాటు 12,751 గ్రామపంచాయతీలు ఉన్నా యి. హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిధిలోనే దాదాపు 2.20 లక్షల అక్రమ ప్లాట్లు ఉన్నట్లు అంచనా.  రాష్ట్రవ్యాప్తంగా వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకూ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ చార్జీలను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో కోట్లమందికి ఆర్థికంగా ఊరట కలుగనుంది. చార్జీల తగ్గింపు ఎలా ఉందంటే..

  • హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ జెడ్పీ రోడ్డు లో 2013, ఏప్రిల్‌ కంటే ముందు సబ్‌ రిజిస్ట్రార్‌ మార్కెట్‌ విలువ చదరపు గజానికి రూ.4800. ఆ తర్వాత గజానికి రూ.8వేలుగా ఖరారు చేశారు. ఇప్పటికీ అదే ధర ఉన్నది. ఆ ప్రాంతంలో 2013, ఏప్రిల్‌ కంటే ముందుగా కొన్న ఓ 200 గజాల ప్లాటుకు 131 జీవో ప్రకారం క్రమబద్ధీకరణ చార్జీలు లెక్కిస్తే రూ.2,74,100 అవుతుంది. సవరించిన జీవో 135 ప్రకా మైతే రూ.1,61,120 చెల్లించాలి. అంటే.. సదరు ప్లాటు యజమానికి రూ.1.10 లక్షల వరకు ఊరట కలుగుతుంది.
  • 2013, ఏప్రిల్‌ తర్వాత కొనుగోలు చేసిన వారికైతే  రూ.25వేల వరకు ఊరట.
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని డివిజన్‌-18, 19 (రేగుర్తి)లో 2013, ఏప్రిల్‌ కంటే ముందు సబ్‌ రిజిస్ట్రార్‌ మార్కెట్‌ విలువ చదరపు గజానికి రూ.800. ఆ తర్వాత అక్కడ గజానికి రూ.1500గా ఖరారు చేశారు. 200 చదరపు గజాలున్న ప్లాటు 2013, ఏప్రిల్‌ కంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ అయినవారికి 131 జీవో ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు రూ.58,700 అవుతాయి. జీవో135 మేరకు రూ.35,760.
  • 2013, ఏప్రిల్‌ తర్వాత కొనుగోలు చేసిన వారికైతే రూ.3-4వేల వరకు ఊరట.
  • హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ రహదారిపై ఉన్న చింతపల్లి పరిధిలో రోడ్డు వెంట భూముల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ మార్కెట్‌ విలువ 2013, ఏప్రిల్‌ కంటే ముందు గజానికి రూ.300. ఆ తర్వాత ఇప్పటివరకు మార్కెట్‌ విలువ గజానికి రూ.1200. ఈ క్రమంలో 200 చదరపు గజాలున్న ప్లాటు 2013, ఏప్రిల్‌ కంటే ముందుగా రిజిస్ట్రేషన్‌ అయినట్లయితే ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు రూ.50,300 అవుతాయి. సవరణ జీవో ప్రకారమైతే రూ.21,760 అవుతాయి. 
  • 2013, ఏప్రిల్‌ తర్వాత కొన్నవారికైతే  రూ.3-4వేల వరకు ఊరట.


logo