ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 07:27:00

పని ఒత్తిడి తట్టుకోలేక ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

పని ఒత్తిడి తట్టుకోలేక ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ : పని ఒత్తిడి తట్టుకోలేక ఓ ప్రైవేటు ఉద్యోగి.. తాను పనిచేస్తున్న కార్యాలయంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను చాలా ట్రై చేశా.. ఓవర్‌ కమ్‌ కావడానికి.. నా వల్ల కావట్లేదు.. ఈ టెన్షన్స్‌ ఇంకా తీసుకోలేను.. వర్క్‌లో ఎదైనా తప్పు ఉంటే మన్నించండి... క్షమించండని అధికారులకు... అలాగే అరుణా సారీ.. నీకు ఒక మంచి భర్తను కాలేకపోయా.. పిల్లలకు మంచి ఫాదర్‌ను కాలేకపోయా అంటూ భార్యకు... అలాగే.. అమ్మా... సారీ.. పిల్లలను, అరుణను బాగా చూసుకోండి అంటూ తల్లికి.. తన కుటుంబాన్ని ఆదుకోవాలని, తన పిల్లల చదువులకు సాయపడాలని అధికారులకు....అత్తమామల పేరిట సూసైడ్‌ నోట్‌ రాసి ఓ ఉద్యోగి బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనంప్రకారం... రంగారెడ్డి జిల్లాకు చెందిన కె.తిరుపతి రెడ్డి ఫిల్మ్‌నగర్‌లో భార్య అరుణ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. ఎర్రమంజిల్‌ కాలనీ, ఎంఎస్‌ రెడ్డి అపార్టుమెంట్స్‌లోని ఫ్లాట్‌ నం. 402లో  దీత్యా ప్రాజెక్ట్స్‌ (సివిల్‌ కన్సస్ట్రక్షన్‌ సంస్థ) లో 2014 నుంచి పరిపాలన విభాగంలో పనిచేస్తున్నాడు. కాగా.. తిరుపతి రెడ్డి శుక్రవారం ఉదయం యథావిధిగా విధులకు వెళ్లాడు. ఆఫీసులోని తన చాంబర్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. మధ్యాహ్నం 1.30గంట వరకు కూడా బయటకు రాలేదు. అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా రాలేదు. చారు. దీంతో మరో తాళంతో తలుపులు తెరిచి చూడగా, చున్నీతో ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్నాడు. వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 

పని ఒత్తిడి కారణమేనా...?

తిరుపతిరెడ్డి మృతి అనేక అనుమానాలకు తావిస్తుంది. ఉదయం 10.30గంటలకు ఆఫీసుకు వచ్చిన తిరుపతి రెడ్డి .. మధ్యాహ్నం 1.30గంటలకు ఉరివేసుకున్నాడని చెబుతుండగా, నిత్యం ఆఫీసులో అందరితో కలిసి లావాదేవీలు చూసుకునే అతన్ని నాలుగు గంటల పాటు ఎవరూ పలుకరించకపోవడం, సూసైడ్‌ నోట్‌లో పని ఒత్తిడి అని రాసి ఉండగా, ఆ ఒత్తిడికి కారకులెవరు.... అందులో పేర్కొన్న ఫోన్‌ నంబర్లు ఎవరివి? అనే పలు కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఆఫీసులో ఆ చున్నీ ఎక్కడిది...?

అపార్ట్‌మెంట్స్‌లోని కార్యాలయంలో తిరుపతిరెడ్డి ఓ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు, ఆ కార్యాలయం సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆ చున్నీ ఎక్కడి నుంచి వచ్చిందనేది పలు అనుమానాలకు తావిస్త్తుంది.  ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని చెబుతుండగా, ఎవరు కిందకు దించారన్నది తెలియాల్సి ఉంది. పో లీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్‌ నోట్‌లో యశ్వంత్‌, సుధీర్‌, వరుణ్‌, నిషాంత్‌, సుకేష్‌ల పేర్లు ఉన్నాయి. అయితే అందులోనే భార్య, తల్లిదండ్రులు, అత్తమామలు, కుటుంబ సభ్యుల అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు ఉంది. అధికారులకు రాసిన లేఖలో వారి పేరు, విషయాలను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందో అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి రెడ్డి మృతదేహం గాంధీ మార్చురీలో ఉండగా, భార్య అరుణను విచారిస్తే మరిన్నీ వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. 


logo