శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 28, 2020 , 21:26:33

పట్టణాల్లోని దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి కేటీఆర్‌

పట్టణాల్లోని దీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తుల పైన ఉన్న టైటిల్ హక్కుల సంబంధిత సమస్యలను శాశ్వతంగా తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఈ దిశగా ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభమైందన్నారు. ఇందులో భాగంగా సోమవారం అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల పరిధిలోని పురపాలక సంఘాలవారీగా రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా నుంచి రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి దయాకర్‌రావు, స్త్రీ శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, ఉమ్మ‌డి జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల ప‌రిధిలోని వారి వారి స‌మ‌స్య‌ల‌తో కూడిన విన‌తి ప‌త్రాల‌ను మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.

మున్సిపాలిటీలోని పేదప్రజల సమస్యలకు పరిష్కారం..

గ్రామాల కన్నా పట్టణాల్లో ప్రజలకు తమ ఆస్తులకు సంబంధించిన టైటిల్ రిలేటెడ్‌ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, దీనికి అనేక కారణాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో దశాబ్దాల తరబడి నివాసముంటున్న వారికి ఇప్పటికే 58, 59 జీవోల ద్వారా పెద్ద ఎత్తున ఉపశమనం కలిగించామన్నారు. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల సమస్యలు పరిష్కారం కాని కేసుల పైన ప్రత్యేక దృష్టి సారించి, మున్సిపాలిటీలోని పేద ప్రజలకు పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలోనే తీసుకోబోతోందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంచు భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. 

తమ ఆస్తులపైన హక్కులకు భద్రత కలిగించే ఈ చర్యకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 15 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సమావేశానికి హాజరైన మంత్రులను, ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. దీంతోపాటు పట్టణాల్లో ఏళ్లుగా పేరుకుపోయిన భూ సంబంధిత సమస్యలను సేకరించి ఇవ్వాలని సూచించారు. ఈ కాలనీలో ఇలాంటి భూ సంబంధిత సమస్య వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. వారి సంఖ్య.. వారికి కావాల్సిన పరిష్కారం ఏమిటి.. లాంటి వివరాలను తనకు అందించే సమాచారంలో సూచించాలని కేటీఆర్‌ అన్నారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారికి శాశ్వత పరిష్కారం అందించే విధంగా నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దీంతో వారి వారి ఆస్తులకు సంపూర్ణ హక్కులు దక్కడంతోపాటు భవిష్యత్తులో క్రయవిక్రయాలకు ఎలాంటి సమస్యలు ఉండకుండా చూస్తామన్నారు.  


ఈ సమావేశానికి హాజరైన అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్నటువంటి పట్టణాల్లో పేరుకుపోయిన రెవెన్యూ, భూ సంబంధిత సమస్యలను మంత్రి వద్ద ప్రస్తావించారు. ఇప్పటికే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని మంత్రి కేటీఆర్‌కు సమర్పించారు. రేపు సాయంత్రంలోగా ఆయా పట్టణాలు, కాలనీలో ఉన్న ప్రతి సమస్యను పురపాలక శాఖకు అందజేస్తామని వారు తెలిపారు. కాగా, ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంపూర్ణ సహకారం అందించాలని ఈ సమావేశంలో పాల్గొన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌, సీడీఎంఏ సత్యనారాయణ, డీటీసీపీ విభాగాల ఉన్నతాధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.