బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:40:56

నూతన సచివాలయం అవసరం

నూతన సచివాలయం అవసరం
  • ప్రస్తుత పిటిషన్లకు విచారణార్హత లేదు
  • హైకోర్టుకు తెలిపిన ఏజీ బీఎస్‌ ప్రసాద్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తలమానికంగా నిలిచే సమీకృత సచివాలయ భవనం రాష్ర్టానికి అవసరమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సచివాలయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లేలా ఆదేశాలు జారీచేయాలని అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానంద ప్రసాద్‌ హైకోర్టుకు విజ్ఞప్తిచేశారు. ప్రస్తుత సచివాలయ భవనాల కూల్చివేతపై దాఖలైన పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. 


ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. నూతన సచివాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లకు విచారణార్హత లేదని, రాజకీయ ప్రత్యర్థులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పిటిషన్లు వేశారని పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కోర్టులు అడ్డుకోవచ్చని, ప్రస్తుతం నిర్మించతలపెట్టిన భవనం రాష్ట్ర పరిపాలనకు కేంద్రంగా ఉండే సచివాలయమని తెలిపారు. ప్రస్తుత పిటిషన్లకు విచారణార్హత లేదని, వాటిని కొట్టేయాలని విజ్ఞప్తిచేశారు. మరోవైపు పిటిషనర్లు రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు తరఫు న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని పేర్కొన్నారు. 


ప్రభుత్వానికి సెల్యూట్‌

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ నీటిపారుదల రంగంలో ప్రభుత్వం గొప్ప కృషి చేస్తున్నదని, ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ చొరవ గొప్పదని కొనియాడారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్టులు కడుతున్న ప్రభుత్వానికి సెల్యూట్‌ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయ భవనాలను కూల్చకుండా అడ్డుకోవాలని కోరారు. వాదనలు నమోదుచేసుకున్న ధర్మాసనం.. తదుపరి వి చారణను శుక్రవారానికి వాయిదావేసింది. 


logo
>>>>>>