సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 02:35:59

రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం

రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం

  • ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నూతన శకం ప్రారంభమవుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. శతాబ్దాల నాటి చట్టాల బూజు దులుపుతూ.. అవినీతిరహిత వ్యవస్థే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లుగా కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి.. రాష్ట్రంలోని అన్ని వర్గాలను, భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేసిందని తెలిపారు. తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ భారీ సంస్కరణలు సంకల్పించారని పేర్కొన్నారు. భూ సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు శతజయంతి సంవత్సరంలో.. ప్రజాకవి కాళోజీ జయం రోజున.. రైతుకు దన్నుగా సీఎం కేసీఆర్‌ రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం విశేషమన్నారు. 

‘కొత్త రాష్ట్రం పొద్దుపొడిచింది..

తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఆరేండ్లుగా సరికొత్త పాలనా సంస్కరణలతో పరిపాలనను ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గర చేసింది. దశాబ్దాలుగా బూజుపట్టిన చట్టాలను తిరగరాసి.. పారదర్శక పాలనకు పెద్ద పీట వేస్తూ.. అవినీతి రహిత వ్యవస్థ కోసం నడుంకట్టి జనరంజక పాలనతో ముందుకుసాగుతున్న వేళ.. మొన్న పంచాయతీరాజ్‌ చట్టం.. నిన్న మున్సిపల్‌ చట్టం... నేడు రెవెన్యూ చట్టం... ఐదేండ్ల కోసం వచ్చే రాజకీయాలను పక్కన నెట్టి , భవిష్యత్‌ తరాల అవసరాల కోసం అలుపెరుగని అభివృద్ధి ప్రస్థానం.. జయహో తెలంగాణ... జయ జయహో కేసీఆర్‌' అని కేటీఆర్‌ ట్వీట్‌చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఫోన్‌లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.


logo