బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:38

దూరదృష్టిలోపంతోనే ఈ దురవస్థ

దూరదృష్టిలోపంతోనే ఈ దురవస్థ

  • ఉస్మానియా దవాఖానకు కొత్త భవనం కట్టక తప్పదు

డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌.. ఉస్మానియా వైద్య కళాశాల పూర్వ విద్యార్థి. అక్కడనే చదివిన ఆయన అక్కడే అధ్యాపకుడిగా వైద్యవిద్యార్థులకు బోధించారు. ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో ప్రొఫెసర్‌గా, సూపరింటెండెంట్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆ వైద్యశాలతో దశాబ్దాల అనుబంధం ఆయనది. ఆ దవాఖానకు సంబంధించిన సమస్త వివరాలు ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలిసే అవకాశం లేదు. దాని లోటుపాట్ల గురించి, బాగోగుల గురించి స్పష్టమైన అవగాహన, సాధికారత ఉన్న డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రస్తుత ఉస్మానియా దవాఖాన పరిస్థితుల గురించి వెలిబుచ్చిన విలువైన అభిప్రాయాలివి. ఆయన ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 

శతాబ్ది చరిత్ర కలిగిన ఉస్మానియా వైద్యశాల ఇటీవల వర్షపునీరు దవాఖానలోకి ప్రవేశించడంతో మరోసారి వార్తల్లో చోటుచేసుకున్నది. చరిత్రలోకి చూస్తే.. 1886లో మొదటి సాలార్‌జంగ్‌ నవాబ్‌ అలీ ఖాన్‌ ముఖ్తార్‌ ఉల్‌ ముల్క్‌ బహాదుర్‌ ఈ దవాఖానను నిర్మించారు. దీనిని అఫ్జల్‌గంజ్‌ దవాఖానగా పిలిచేవారు. మూసీ నదికి 1908లో వచ్చిన తీవ్రస్థాయి వరదల కారణంగా ఆ దవాఖాన పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో కొత్త దవాఖానను నిర్మించాల్సి వచ్చింది. అదే ఇప్పుడున్న ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌. దీనిని ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1925లో ప్రముఖ ఆర్కిటెక్ట్‌ విన్సెంట్‌తో నిర్మింపజేశారు. విశాలమైన 26.5 ఎకరాల ప్రదేశంలో 450 పడకల సామర్థ్యంతో వైద్యశాల రూపొందింది. ఇది శతాబ్దకాలంగా లక్షల మందికి ఉత్తమమైన సేవలందిస్తున్నది. 

క్లోరోఫామ్‌పై తొలి అధ్యయనం ఇక్కడే..

వైద్యచికిత్సలో నొప్పిని తెలియకుండా చేసే మత్తుమందు కారకమైన క్లోరోఫాం గురించి ప్రపంచంలో తొలిసారిగా ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లోనే (1888-91) అధ్యయనం చేశారు. అది సురక్షితమైనదేనని అధ్యయనంలో స్పష్టమయింది. భారతదేశంలో తొలి కిడ్నీ మార్పిడి జరిగిన ప్రభుత్వ దవాఖాన ఉస్మానియాయే. అది 1982లో జరిగింది. ఇక్కడ కాలేయమార్పిడి శస్త్రచికిత్సలు కూడా విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో పెరుగుతున్న ప్రజారోగ్య సేవల అవసరాల దృష్ట్యా కొత్త భవనాలను నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణం విషయంలో కొన్ని సాంకేతికపరమైన చిక్కుముడులు ఎదురవుతున్నాయి. ఇదివరలో పలు సందర్భాల్లో భూమి కేటాయింపుల్లో భవిష్యత్‌ అవసరాలను దృష్టిలోకి తీసుకోలేదు. ఆ దూరదృష్టి లోపం ఫలితంగానే ఇప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయి. తొలుత దవాఖానకు 25 ఎకరాల స్థలముండేది. అది వసతులకు సరిపడా విశాలంగానే ఉండేది. తర్వాత కాలంలో భూమిని ఇతర అవసరాలకు కేటాయించడంతో అది ఇబ్బందికరంగా పరిణమించింది. దవాఖాన భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించకుండా భూమిని కరెంటు సబ్‌స్టేషన్‌, పోలీస్‌స్టేషన్‌, దంత కళాశాల నిర్మాణాలకు కేటాయించారు. ఇప్పుడు కొత్త నిర్మాణాలకు దవాఖాన ముందుభాగంలో రెండెకరాలు, వెనుకభాగంలో ఐదెకరాల భూమి మాత్రమే ఉన్నది. 

ఉస్మానియాలోని వారసత్వ కట్టడం రెండెకరాల స్థలంలో ఉన్నది. అది శతాబ్దకాలంగా సేవలందిస్తూ వచ్చింది. సాంకేతిక నిపుణుల నివేదికల ప్రకారం దానిని ఇప్పుడు రోగుల రక్షణ సేవలకోసం వినియోగించుకోరాదు. దాంతో ఆ భవనాన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉంచి, కొంత పటిష్ఠపరిచి మ్యూజియంగా కేవలం పరిపాలనాపరమైన అవసరాలకే ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. 

ఉస్మానియా దవాఖానలో పెరుగుతున్న అవసరాల కోసం వారసత్వ భవనం వెనుక వైపున అంతస్తుకు లక్ష చదరపు అడుగుల వైశాల్యంతో ఎనిమిది అంతస్తులను నిర్మించాలని ప్రతిపాదించారు. దీనిని వారసత్వ కట్టడాల పరిరక్షణ కార్యకర్తలు వ్యతిరేకించారు. కొత్త భవనాలు ఈ వారసత్వ కట్టడానికన్నా తక్కువ ఎత్తులోనే ఉండాలని, నాలుగు అంతస్తులను మాత్రమే నిర్మించాలని షరతు పెట్టారు. ప్రస్తుత వైద్య విభాగాల అవసరాలకు, అలాగే భవిష్యత్తు అవసరాలకు ఆ నిర్మాణాలు ఎంతమాత్రం సరిపోవు. సాంకేతికంగా మరో సమస్య కూడా ఉన్నది. బేగంబజార్‌ ప్రాంతం నుంచి ఒక భారీ భూగర్భ కాలువ ప్రతిపాదిత కొత్త భవనం, వారసత్వ భవనం కిందుగానే పోతున్నది. ఈ రకంగా అక్కడ ఇప్పటికి పరిమితంగానే అందుబాటులో ఉన్న ఐదెకరాల స్థలంలోనూ కొత్త భవనాల నిర్మాణాలకు సాంకేతికపరమైన క్లిష్టతలున్నాయి. 

కొత్తది కట్టక తప్పదు

ఇప్పుడు ఉస్మానియా దవాఖాన ప్రాంగణంలో వారసత్వ భవనాన్ని కూల్చకుండా, తక్కువ ఎత్తులోనే మరో భవనాన్ని నిర్మిస్తే అది భవిష్యత్తు అవసరాలను కాదుకదా ప్రస్తుత అవసరాలను కూడా ఏమాత్రం తీర్చలేదు. అందువల్ల భవిష్యత్తు దృష్టితో ప్రజలకు విస్తృతస్థాయిలో వైద్య సేవలు అందుబాటులో ఉండాలంటే పాతదాని స్థానంలో కొత్తది కట్టక తప్పదు. ఉస్మానియా దవాఖానలో వైద్యసేవల అవసరాలు పెరుగుతున్నాయి. 2015 నుంచి 2018 వరకే ఔట్‌పేషంట్ల సంఖ్య రెట్టింపయింది. 2015లో ఔట్‌పేషంట్ల సంఖ్య 4,73,224 ఉండగా, ఆ సంఖ్య 2018నాటికి 9,46,970కి చేరుకున్నది. ఇన్‌పేషంట్ల సంఖ్య 47,347 నుంచి 52,280కి పెరిగింది. ఈ సంఖ్యా వివరాలను పరిశీలిస్తే.. ఔట్‌పేషంట్లు రెట్టింపయినప్పటికీ ఇన్‌పేషంట్లు మాత్రం ఆ నిష్పత్తిలో లేకపోవడం, చాలా తక్కువగా ఉండటం స్పష్టమవుతుంది. అంటే ప్రజలు ఔట్‌పేషంట్‌ సేవలు పొందుతున్నారుగానీ ఇన్‌పేషంట్లుగా చేరడానికి వెనుకాడుతున్నారు. దీనికి కారణం పాత భవన పరిస్థితి అని భావించవచ్చు. పెచ్చులూడుతున్న గోడలను చూస్తే ఎవరికైనా భయం కలగడం సహజం. ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో పెరుగుతున్న పేషంట్ల సంఖ్యకు అనుగుణంగా వసతి సౌకర్యాలు కల్పించడం సాధ్యంకావడం లేదన్నది వాస్తవం. ఇది వైద్యశాల ఎదుర్కొంటున్న ప్రధానమైన తీవ్ర సమస్య. 1908లో మూసీ నదికి వచ్చిన వరదలు 1925లో కొత్త ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ భవన నిర్మాణానికి మార్గం వేశాయి. అలాగే ఇప్పుడు ఉస్మానియా దవాఖానలోకి వర్షపు నీరు చేరడమన్నది ఆరోగ్యస్పృహ కలిగిన మేధావులందరినీ మేల్కొలపాలి. వారసత్వ సంపద పరిరక్షణ కార్యకర్తలు కూడా పునరాలోచించి, ప్రజారోగ్య సేవల అత్యవసరాలను గుర్తెరగాలి. ఉస్మానియాలో కొత్త భవన నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చూడాలి.


logo