గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 03:34:23

కోటి లంచం

కోటి లంచం

  • కీసర తాసిల్దార్‌ అవినీతి
  • ఏసీబీ చరిత్రలోనే భారీ మొత్తం.. మెషీన్లతో నోట్లు లెక్కింపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/కీసర: అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.కోటి 25 లక్షలు లంచంగా తీసుకుంటూ మేడ్చల్‌ జిల్లా కీసర తాసిల్దార్‌ నాగరాజు ఏసీబీ అధికారులకు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తాసిల్దార్‌తోపాటు రాంపల్లి వీఆర్‌ఏ బొంగు సాయిరాజ్‌, రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌, ఏజెంట్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. కీసర మండలం రాంపల్లి దయారాలోని 28 ఎకరాల వ్యవసాయభూమి విషయంలో వివాదం నడుస్తున్నది. ఈ భూమిని రియల్‌ఎస్టేట్‌ సంస్థకు అనుకూలంగా మార్చి కాగితాలు తయారుచేసేందుకు తాసిల్దార్‌ నాగరాజు భారీగా లంచం డిమాండ్‌ చేశాడు. ఈ విషయం ఉప్పందడంతో ఏసీబీ అధికారులు ఏఎస్‌రావు నగర్‌లోని తాసిల్దార్‌ ఇంటి పరిసరాల్లో శుక్రవారం రాత్రి మాటువేశారు. అనుకున్నట్టుగానే రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌ శ్రీనాథ్‌, ఏజెంట్‌ కన్నడ అంజిరెడ్డిని రాత్రి 9 గంటల సమయంలో తాసిల్దార్‌ ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించారు. లావాదేవీలో మధ్యవర్తిగా ఉన్న రాంపల్లి వీఆర్‌ఏ బొంగు సాయిరాజ్‌ను సైతం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

కట్టల గుట్టలు: 

తాసిల్దార్‌ నాగరాజు ఇంట్లో సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారులు కట్టల గుట్టలు చూసి ఆశ్చర్యపోయారు. అన్నీ రూ.500, రూ.100 నోట్ల కట్టలు బయటపడ్డాయి. నోట్ల కట్టలు లెక్కించేందుకు ఏసీబీ అధికారుల బృందం గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. లెక్కింపు యంత్రాలు తెప్పించి నగదు లెక్కించారు. తాసిల్దార్‌ నాగరాజు ఆది నుంచి ఇదే తరహా లంచావతారుడని తెలుస్తున్నది. ఇటీవలే ఓ ఏసీబీ కేసు నుంచి బయటపడినట్టు సమాచారం. ఓ రాజకీయ నేత అండతో..

ఈ భారీ లంచం ఆఫర్‌ వెనుక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ కీలక నేత ఉన్నట్టు సమాచారం. నిత్యం వివాదాస్పదవ్యాఖ్యలు చేస్తూ, డబ్బు ల కట్టల వ్యవహారాల్లో మునిగే ఓ కీలకనాయకుడి అనుచరుడే పట్టుబడినవారిలో ఒకరని సమాచారం. ఆ నాయకుడి అండ చూసుకునే ఈ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ భూ దందాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ అధికారుల సోదాలు శనివారం సైతం సోదాలు కొనసాగే అవకాశం ఉన్నది. 


logo