మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 11:13:20

పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'

పూజలు చేస్తున్న 'కాకి'.. ప్రాణంగా చూసుకుంటున్న 'మీనా'

రఘునాథపాలెం, జనవరి 19 : కాకి పిల్ల కాకికి ముద్దు అని దీర్ఘాలు తీస్తుంటారు. కాకి ఇంటి ముందుకు వచ్చి అరిస్తే అశుభంగా భావిస్తారు. మరి ఇదిగో ఈ చిత్రాలు వీటిని కొట్టిపారేసే విధంగా కనిపిస్తున్నాయి చూడండి. ఓ మహిళ కాకిని ప్రాణంగా చూసుకుంటూ కాకి పిల్లా మనిషికీ ముద్దే అని రుజువుచేసింది. మాట్లాడిన మాటలు కాకికి అర్థమయ్యేలా చేసి నిత్యం తన వెంటే ఉండేలా చూసుకుంటోంది ఖమ్మం నెహ్రూనగర్‌కు చెందిన మీనా.

రెండేళ్ల క్రితం ఆమె ఇంటి ముందున్న విద్యుత్‌ స్తంభంపై ఓ కాకి గుడ్లు పెట్టి పిల్లలు చేసింది. తరువాత ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై తల్లి కాకి మృతిచెందింది. అదే సమయంలో నాలుగు పిల్లలున్న కాకి గూడు చెల్లాచెదురై స్తంభంపై నుంచి కింద పడిపోయింది. మీనా గమనించి.. ఆ కాకి పిల్లలను చేరదీసి జాగ్రత్తగా సాకింది. కొన్ని రోజులకు రెక్కలొచ్చాక మూడు కాకులు ఎగిరిపోయాయి. ఒకటి మాత్రం మీనా వద్దే ఉండిపోయింది. దానికి ఆమె ‘వాణి’ అని పేరు కూడా పెట్టింది. రెండేళ్లుగా అత్యంత ప్రేమతో చూసుకుంటోంది. మీనా చెప్పిన మాటలను కాకి చక్కగా వింటుంది. ఏం చెబితే అది చేస్తుంది. దేవుడి ఫొటోల వద్ద పూలు వేసి పూజలు కూడా చేస్తుంది. టీ తాగుతుంది. ఆకలైనప్పుడల్లా అరిచిగోల చేస్తుంది. కావాల్సినవి తింటుంది. మీనా వంట చేస్తుంటే దగ్గరే ఉండి మరీ చూస్తుంది. ఒళ్లో కూర్చుంటుంది. ‘వాణీ..’ అని పిలవగానే ఇంట్లో ఏ గదిలో ఉన్నా వెంటనే మీనా దగ్గరి వచ్చి భుజంపై వాలిపోతుంది. ప్రేమ, అప్యాయతలు మనుషులకే కాదు.. పక్షులకూ ఉంటాయని ఈ బంధాన్ని చూస్తుంటే అవగతమవుతుంది కదూ.. 


VIDEOS

logo