మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 17:30:27

ప‌సిబిడ్డ‌ను రూ. 1.50 ల‌క్ష‌ల‌కు అమ్మేసిన త‌ల్లి

ప‌సిబిడ్డ‌ను రూ. 1.50 ల‌క్ష‌ల‌కు అమ్మేసిన త‌ల్లి

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి : ఓ త‌ల్లి త‌న ప‌సిబిడ్డ‌ను రూ. 1.50 ల‌క్ష‌ల‌కు అమ్మేసింది. ఐదు నెల‌ల క్రితం శిశువును అమ్మి.. ఇప్పుడేమో త‌న బిడ్డ త‌న‌కు కావాల‌ని పోలీసులను ఆశ్ర‌యించింది. ఈ ఘ‌ట‌న‌ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో ఐదు నెల‌ల క్రితం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

కాళేశ్వ‌రం గ్రామానికి చెందిన సిరిపురం చంద్ర‌క‌ళ‌.. ఇప్ప‌టికే ముగ్గురు పిల్ల‌లు ఉండ‌గా, ఐదు నెల‌ల క్రితం మ‌రో మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. జూన్ 28న మ‌హ‌దేవ్‌పూర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో డెలివ‌రీ అయింది. అయితే వృత్తిరీత్యా చంద్ర‌క‌ళ ఉల్లిగ‌డ్డ‌లు అమ్ముకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తోంది. చంద్ర‌క‌ళ ఆర్థిక అవ‌స‌రాల‌ను ఆస‌రా చేసుకున్న ఆస్ప‌త్రి సిబ్బంది.. ఆమెతో బిడ్డ‌ను ఎలాగైనా అమ్మించాల‌ని ప్ర‌య‌త్నించారు. మొత్తానికి చంద్ర‌క‌ళ‌కు రూ. 1.50 ల‌క్ష‌లు ఇచ్చి.. బ‌ల‌వంతంగా బాలుడిని తీసుకెళ్లారు. ఐదు నెల‌లు గ‌డిచాక‌.. ఇప్పుడు త‌న బిడ్డ త‌న‌కు కావాల‌ని చంద్ర‌క‌ళ‌.. ఆస్ప‌త్రి సిబ్బందిని అడిగింది. సిబ్బంది నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో బాధితురాలు చంద్ర‌క‌ళ కాళేశ్వ‌రం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. చంద్ర‌క‌ళ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆస్ప‌త్రి సిబ్బందితో పాటు మ‌ల్హ‌ర్ మండ‌లం వ‌లెంకుంటా గ్రామానికి చెందిన సంపెడ శ్రీల‌త‌, స‌దుపై కేసు న‌మోదు చేశారు.