గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 13:50:35

ఆడ‌బిడ్డ అనుకొని అమ్మేసింది.. కానీ మ‌గ‌బిడ్డ‌

ఆడ‌బిడ్డ అనుకొని అమ్మేసింది.. కానీ మ‌గ‌బిడ్డ‌

హైద‌రాబాద్ : క‌డు పేద‌రికానికి చెందిన ఓ ఇద్ద‌రు దంప‌తులు.. త‌మ‌కు మూడో సంతానంలో కూడా అమ్మాయే పుట్టే అవ‌కాశం ఉంద‌ని భావించారు. ఆ బిడ్డ‌ను అమ్మాల‌ని దంప‌తులు నిర్ణ‌యించుకున్నారు. డెలివ‌రీ కంటే ముందే రూ. ల‌క్ష‌కు డీల్ కుదుర్చుకున్నారు. కానీ ఆమెకు మూడో సంతానంలో మ‌గ‌బిడ్డ పుట్టింది. అయినా లాభం లేదు. ముందు కుదుర్చుకున్న డీల్ ప్ర‌కారం.. ఆ బిడ్డ‌కు త‌ల్లి స్ప‌ర్శ త‌గ‌ల‌క‌ముందే.. మ‌రో ఒడికి చేర‌వేశారు. ఆ చిన్నారి త‌ల్లి త‌న బిడ్డ త‌న‌కు కావాలంటూ ఇప్పుడు ప్రాధేయ‌ప‌డుతుంది. ఈ ఘ‌ట‌న నాచారం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఏడాది జూన్ 19న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

నాచారం పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. పటాన్ చెరుకు చెందిన‌ మీనా, వెంక‌టేశ్ అనే దంప‌తులు మూడేళ్ల క్రితం ఉపాధి కోసం నాచారంలోని అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌కు వ‌చ్చారు. వీరికి మొద‌టి సంతానంలో ఆడ‌బిడ్డ జ‌న్మించ‌గా, పురిటిలోనే చ‌నిపోయింది. రెండో కాన్పులో కూడా అమ్మాయే పుట్టింది. ఇక మూడో కాన్పులో కూడా త‌న‌కు ఆడ‌బిడ్డ జ‌న్మించే అవ‌కాశం ఉంద‌ని మీనా భావించింది. దీంతో జాన‌కి అనే మ‌హిళ‌తో.. ఈ విష‌యాన్ని చెప్పింది. త‌మ మూడో సంతానాన్ని ఎవ‌రికైనా అమ్మేస్తామ‌ని జాన‌కికి మీనా చెప్పింది. ఈ క్ర‌మంలో జాన‌కికి ద‌గ్గ‌రి బంధువులైన రాజేశ్‌, న‌హీనా అనే దంప‌తుల‌కు సంతానం లేదు. దీంతో వారికి మీనాకు పుట్ట‌బోయే బిడ్డ‌ను అమ్మేలా ప్లాన్ చేసింది. బిడ్డ‌ను రూ. ల‌క్ష‌కు అమ్మేందుకు మీనా దంప‌తులు ఒప్పందం చేసుకున్నారు. 

ఈ ఏడాది జూన్ 16న నాచారంలోని ఈఎస్ఐ ఆస్ప‌త్రిలో రాజేశ్‌.. మీనాను చేర్పించి డెలివ‌రీ చేయించాడు. కానీ ఆమె భావించిన‌ట్లు ఆడ‌పిల్ల పుట్ట‌లేదు. పండంటి మ‌గ‌బిడ్డ‌కు మీనా జ‌న్మ‌నిచ్చింది. కానీ ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం.. ఆ బిడ్డ‌ను రాజేశ్ దంప‌తుల‌కు అప్ప‌జెప్పారు. ఇదంతా డెలివ‌రీ అయిన మ‌రుస‌టి రోజే జ‌రిగిపోయింది. 

ఐదు నెల‌ల త‌ర్వాత వెలుగులోకి..

మీనా త‌న బిడ్డ‌ను త‌న‌కు అప్ప‌గించేలా చూడాల‌ని నిన్న రాత్రి నాచారం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అప‌న‌మ్మ‌కంతోనే మీనా త‌న బిడ్డ‌ను అమ్ముకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంద‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఇప్ప‌టికే రూ. ల‌క్ష మీనాకు ఇచ్చిన‌ట్లు తేలింది. త‌న బిడ్డ‌ను బ‌ల‌వంతంగా తీసుకెళ్లార‌ని మీనా చెబుతున్న విష‌యం అవాస్త‌వ‌మ‌ని తెలిసింది. అయితే బిడ్డ‌ను అమ్మిన వారిపై, కొన్న వారిపై కేసులు న‌మోదు చేశామ‌ని, వీరిని కోర్టు ముందు హాజ‌రుప‌రుచుతామ‌ని పోలీసులు తెలిపారు. ఆ ప‌సిబిడ్డ‌ను చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీకి అప్ప‌గించామ‌ని పోలీసులు పేర్కొన్నారు.