శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:44

కష్టకాలంలో ఆదుకోని కేంద్రం

కష్టకాలంలో ఆదుకోని కేంద్రం

  • కరోనా నేపథ్యంలో రాష్ర్టాల్లో ఆర్థిక సంక్షోభం 
  • జీఎస్టీ పరిహారంతో ఆదుకోవాలన్న తెలంగాణ
  • గత ఏడాది బకాయిలనే ఇప్పుడిచ్చిన కేంద్రం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం అంటే అన్ని రాష్ర్టాలకు పెద్దదిక్కు. ఓ పెద్దన్నగా వ్యవహరిస్తూ కష్టకాలంలో ఆదుకోవాల్సి ఉంటుంది. మార్గదర్శిగా నిలువాల్సి ఉంటుంది. కానీ.. మోదీ ప్రభుత్వం మాత్రం ఆపత్కాలంలో చేతులెత్తేసింది. లాక్‌డౌన్‌తో రాష్ర్టాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి.. మమ్మల్ని ఆదుకోండి మహాప్రభో అని వేడుకొన్నా పైసా విదల్చడంలేదు. జీఎస్టీ పరిహారం కింద న్యాయంగా రావాల్సిన వాటానే ఇవ్వాలని తెలంగాణ డిమాండ్‌ చేసినా పట్టించుకోవడం లేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలనే విడుదలచేసి గొప్పలు చెప్పుకొంటున్నది. 

ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కలేదు 

లాక్‌డౌన్‌తో రాష్ర్టాల ఆదాయం పడిపోయిందని, ఏప్రిల్‌, మే నెలల జీఎస్టీ పరిహారాన్ని విడుదలచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు గతనెలలో కేంద్రాన్ని డిమాండ్‌చేశారు. తెలంగాణ ఆదాయం పడిపోయిందని ఈ రెండు నెలలకు కలిపి రావాల్సిన రూ.3,975 కోట్లు విడుదలచేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ 40వ సమావేశంలో కోరారు. జూన్‌ నెల పరిహారాన్ని కూడా చెల్లించాలని విన్నవించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోత విధించామని, సంక్షేమ పథకాలపై  ఆ ప్రభావం పడుతున్నదని చెప్పారు. రాష్ట్రం అవసరాల్లో ఉండి పరిహారం కోరితే ఇవ్వరా అంటూ మండిపడ్డారు. అయినా కేంద్రం వైఖరిలో మార్పు లేదు. ఈ ఏడాది జీఎస్టీ పరిహారం ఊసే ఎత్తడం లేదు. 

చెల్లించింది గత ఏడాది బకాయిలే 

కేంద్రం సోమవారం రూ.13 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదలచేసింది. మొత్తం రూ.1.65 లక్షల కోట్లు విడుదల చేశామంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ గొప్పగా ప్రకటించారు. అయితే అవి 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవే కావడం గమనార్హం. ఆదాయం పడిపోయి ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ర్టాలన్నింటికీ కలిపి రూ.13 వేల కోట్లు ఏ మూలకు సరిపోతాయనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. 


logo