ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 02:20:41

సాంకేతికాభివృద్ధికి వారధి

సాంకేతికాభివృద్ధికి వారధి

  • మన పీవీ ఘనతలివీ 

మన దేశంలో ఒకప్పుడు రేడియో వినడమే మహా భాగ్యంగా భావించిన రోజులుండేవనేది ఇప్పటి తరానికి తెలియదు. 1976లో రేడియో నుంచి టీవీ విడివడి, దూరదర్శన్‌ ఏర్పాటయింది. ఆనాడు ప్రకటనలను అనుమతించడం కూడా పెద్ద మార్పుగా భావించేవారు. 1970 దశకంలో సినిమాలు, పాటలు, క్రీడలు, వాణిజ్య ప్రకటనలు ప్రధాన పాత్ర వహించాయి. 1982లో ఆసియా క్రీడల సందర్భంగానే కలర్‌ టీవీలు దేశంలో ప్రవేశించాయి. దూరదర్శన్‌లో వారానికి ఒకసారి వచ్చే చిత్రలహరి పాటల కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇదంతా పీవీ ప్రభుత్వానికి ముందు పరిస్థితి. 

1991లో వీవీ ప్రభుత్వం ఏర్పాటయిన తరువాత అనేక విధానపరమైన మార్పులు వచ్చాయి. దేశంలో పరిమిత స్థాయిలో ప్రైవేటు, విదేశీ ప్రసారాలకు అనుమతి లభించింది. మొదట్లో సీఎన్‌ఎన్‌, స్టార్‌టీవీతోపాటు దేశీయమైన జీటీవీ, సన్‌టీవీ సాట్‌లైట్‌ ప్రసారాలను ప్రారంభించాయి. దీంతో అదే సంవత్సరం చానెళ్ళ సంఖ్య వందకు పెరిగింది. ఏడు కోట్ల ఇండ్లకు టీవీ ప్రసారాలు చేరాయి. వీక్షకుల సంఖ్య నలభై కోట్లకు చేరింది. 1992లో కేబుల్‌ టీవీలకు ఆనుమతి లభించింది. స్టార్‌టీవీ ప్రవేశంతో భిన్నత్వం, విస్తృతి మరింత పెరిగిపోయింది. ఎంటీవీ, స్టార్‌ మువీస్‌తో పాటు క్రీడా ప్రసారాల సంఖ్య పెరిగింది. కేబుల్‌ ద్వారా ప్రసారాలు మొదటగా ప్రారంభించిన భారతీయ చానెల్‌గా జీటీవీని చెప్పుకోవచ్చు. ఆ తరువాత సన్‌టీవీతో పాటు ప్రాంతీయ భాషల్లో చానెల్స్‌ పెరిగిపోయాయి. 

ప్రపంచవ్యాప్తంగా వచ్చే సాంకేతికాభివృద్ధి ఇవాళ మన దేశంలో కూడా కనబడుతున్నది. వందల కొద్ది చానెల్స్‌ ఉన్నాయి. ఓటీటీ విధానం వచ్చింది. ఎవరికి వారే సినిమాలు తీసే కాలం వచ్చింది. మనకు కావలసిన అంశాన్ని, మనకు తీరిక దొరికినప్పుడు చూసే అవకాశం లభించింది. టీవీలు లేని ఇంటిని ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పులు విధానపరంగా పీవీ సరళీకరణ క్రమానికి కొనసాగింపు. 


logo