బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 01, 2020 , 01:34:06

ట్యాబ్‌ ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య

ట్యాబ్‌ ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య
  • మియాపూర్‌ పీఎస్‌ పరిధిలో విషాద ఘటన

చందానగర్‌, నమస్తే తెలంగాణ: తన మాట ఇంట్లో ఎవరూ వినడంలేదని మనస్తాపం చెందిన ఓ బాలుడు తాము నివసించే అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకొన్నది. ఎస్‌ఐ లింగ్యానాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని స్వప్న నిర్మాణ అపార్ట్‌మెంట్‌ పెంట్‌హౌజ్‌లో ఎన్‌ శ్రీనివాస్‌, మల్లీశ్వరి దంపతులు తమ ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. స్థానిక మహర్షి విద్యాలయంలో చదువుకొంటున్న నందకిశోర్‌, బాల వెంకట సత్యప్రసాద్‌ (12) శనివారం స్కూల్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ట్యాబ్‌ కోసం ఇద్దరు గొడవపడటంతో తండ్రి శ్రీనివాస్‌ వారిని వారించి ట్యాబ్‌ను పెద్దకొడుకు నందకిశోర్‌కు ఇచ్చి ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్లొద్దంటూ చిన్నకుమారుడు బాల వెంకట సత్యప్రసాద్‌ తండ్రిని ప్రాధేయపడినా వినకుండా వెళ్లిపోయాడు. దాంతో కలతచెందిన బాల వెంకట సత్యప్రసాద్‌ అక్కడే ఉన్న నిచ్చెన సాయంతో పెంట్‌హౌజ్‌ పైకెక్కి అక్కడి నుంచి అపార్ట్‌మెంట్‌ వెనుక వైపు దూకాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. మియాపూర్‌ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


logo