గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:30

ఏజెన్సీ రైతులకు వరం

ఏజెన్సీ రైతులకు వరం

కష్టాలు దూరం.. సేవలు దగ్గర

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పూర్వపు జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా రైతులు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కోసం 80-90 కి.మీ. వెళ్లాల్సి వచ్చేది. ఆ రోజు ఆ పనికాకపోతే అక్కడే నిద్రపోవాలి. లేదంటే మళ్లీ 90 కిలోమీటర్లు తిరిగొచ్చి..ఉదయం మళ్లీ పోవాల్సిన దుస్థితి. కానీ ధరణితో రైతులకు సేవలు చేరువై.. కష్టాలు దూరమయ్యాయి.

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌ రైతులకు వరమని కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పూర్వపు జాయింట్‌ కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. ధరణి క్షేత్రస్థాయిలో అన్నదాతల కష్టాలను తీర్చిందని కితాబిచ్చారు. ధరణి సక్సెస్‌ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు.. ఆయన మాటల్లోనే..  ‘కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 15 రెవెన్యూ మండలాలు, సుమారు 6.5 లక్షల జనాభా ఉన్నది. గతంలో ఇక్కడ ఒకే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉండేది. అదికూడా జిల్లాకేంద్రంలో. అంటే బెజ్జూరు, దహేగాం, సిర్పూర్‌-టి, పెంచికల్‌పేట, కైతాల.. తదితర మండలాల ప్రజలు వ్యవసాయ భూములను విక్రయించినా, కొన్నా 80-90 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్‌ కోసం సాక్షులతో కలిపితే ఐదారుగురు వచ్చేవారు. ఆఫీస్‌కు వచ్చాక సాంకేతిక కారణాలు, రద్దీ కారణంతో రిజిస్ట్రేషన్‌ జరుగకపోతే.. ఆ రాత్రి ఎక్కడైనా ఉండాల్సి వచ్చేది. లే దా మళ్లీ 80-90 కి.మీ. వెళ్లాల్సిందే. రిజిస్ట్రేషన్‌ పత్రాల కోసం మళ్లీ పోవాల్సిందే. రాత్రి ఆలస్యమైతే అటవీ ప్రాంతాల మీదుగా ప్రయాణాలు బంద్‌ అయ్యేవి. 

మాటల్లో చెప్పలేనంత ఆనందం

ధరణి రాకతో పరిస్థితి మారిపోయింది. నేడు జిల్లాలోని 15 తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. పల్లె ప్రజలకు ఎంత సౌలభ్యంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ధరణితో 15 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తిచేసి.. పట్టాదార్‌ పాసుపుస్తకాన్ని రైతుల చేతిలో పెట్టడమంటే ఆషామాషీ కాదు. ధరణితో ప్రజలకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.