e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home తెలంగాణ 95% రికార్డులు క్లియర్‌

95% రికార్డులు క్లియర్‌

 • 5 శాతం భూములపైనే చిక్కుముడులు
 • ఒక్కో సర్వే నంబరుకు ఒక్కో సమస్య
 • ఆప్షన్లు తీసుకురావడానికి ఇదే ఇబ్బంది
 • వాటినీ పరిష్కరిస్తే 100% లక్ష్యం పూర్తి

అందుబాటులో 39 మాడ్యూల్స్‌

 • 29 సర్వీస్‌ మాడ్యూల్స్‌
 • 10 ఇన్ఫర్మేషన్‌ మాడ్యూల్స్‌
 • 50 రకాల సేవలు

1.32 లక్షల పెండింగ్‌ మ్యుటేషన్లకు విముక్తి

హైదరాబాద్‌, జూలై 31 (నమస్తే తెలంగాణ): భూ లావాదేవీలు, రికార్డులను డిజిటలైజ్‌చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్‌ దూసుకుపోతున్నది. ప్రతినెల లావాదేవీల సంఖ్య పెరుగుతూ జూలైలో రికార్డుస్థాయిలో ఈ పోర్టల్‌ ద్వారా లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. భూ సంబంధ సమస్యల పరిష్కారంలో ధరణి విప్లవాత్మక మార్పులు తెచ్చింది. భూ యజమానులకు అనేక ప్రయోజనాలు కలిగాయి. భూముల వివరాలన్నీ డిజిటలైజ్‌ కావడంతో వాటిని ఇష్టంవచ్చినట్టు మార్చే అవకాశం లేకుండాపోయింది. దీంతో గుంట భూమి ఉన్న రైతు కూడా గుండెలపై చేయి వేసుకొని నిబ్బరంగా ఉంటున్నాడు. రిజిస్ట్రేషన్లలో అవినీతికి చెక్‌ పడింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భూ హక్కుల మార్పిడి జరిగిపోతున్నది. ప్రస్తుతం పోర్టల్‌లో 95 శాతానికిపైగా భూముల రికార్డులు క్లియర్‌గా ఉన్నాయి. కొన్ని భూముల విషయంలో చిన్నచిన్న సమస్యలు తలెత్తుతున్నాయి. అవి కూడా పరిష్కారమైతే ధరణి లక్ష్యం వంద శాతం నెరవేరినట్టేనని అధికారులు చెప్తున్నారు.
సీఎం అన్నట్టుగానే ధరణి రోజురోజుకూ విస్తృతం అవుతున్నది. ప్రారంభంలో కేవలం నాలుగు మాడ్యూల్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం అవసరానికి అనుగుణంగా, ప్రజల ఇబ్బందులను తీర్చేలా మాడ్యూల్స్‌ను పెంచింది. ప్రస్తుతం ధరణిలో 39 మాడ్యూల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో 29 సర్వీస్‌ మాడ్యూల్స్‌ కాగా, 10 ఇన్ఫర్మేషన్‌ మాడ్యూల్స్‌. వీటి ద్వారా ప్రజలకు దాదాపు 50 రకాల సేవలు అందుతున్నాయి. భూ సమస్యలకు సంబంధించి తీరొక్క ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రీవెన్స్‌ రిలేటింగ్‌ టు స్పెసిఫిక్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌ అనే మాడ్యూల్‌లో ఏకంగా 10 రకాల ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా ఏండ్లుగా మోక్షానికి నోచుకోని ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయి. 1.32 లక్షల పెండింగ్‌ మ్యుటేషన్లను అధికారులు పరిష్కరించారు.

- Advertisement -

‘ప్రపంచంలో ల్యాండ్‌ రికార్డ్స్‌ క్లీన్‌గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్‌ ఏది? అని ఎవరిని అడిగినా తెలంగాణ అని అమెరికాలో కూడా చెప్పుకొనే రోజులు రావాలె. ఇందులో భాగంగానే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చినం. ప్రస్తుతానికి కొన్ని లావాదేవీలకే అనుమతి ఉన్నది. రానురాను ఆప్షన్లు పెరుగుతాయి’. -గతేడాది అక్టోబర్‌ 29న ధరణి పోర్టల్‌ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌

చిన్నచిన్న ఇబ్బందులు.. పరిష్కారానికి చర్యలు

విప్లవాత్మకమైన భూసంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన ధరణిలో ఆయా ప్రాంతాల్లో అప్పుడప్పుడూ తలెత్తుతున్న చిన్న చిన్న ఇబ్బందులను ప్రభుత్వం ఒక్కటొక్కటిగా తొలగించుకొంటూ వస్తున్నది. కొన్నింటికి విడివిడిగా ఆప్షన్లను జతచేరుస్తూ పోయింది. తాజాగా పొడచూపిన మరి కొన్ని ఇబ్బందులను కూడా అధికారులు, వినియోగదారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపైనా అధికార యంత్రాంగం దృష్టిసారించింది.

 • ఒక వ్యక్తి భూమి కొన్న తర్వాత మ్యుటేషన్‌ కాకముందే మరణిస్తే, వారి వారసులు పెండింగ్‌ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం ధరణిలో లేదు. మ్యుటేషన్‌ కావాలంటే దరఖాస్తుదారు వేలిముద్రలు ఉండాల్సిందే. అలాకాకుండా వారసులను ధ్రువీకరించుకొని, వారి పేరుమీదికి భూమిని బదలాయించే వ్యవస్థ ఉంటే బాగుంటుందని వినియోదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
 • ఒక రైతు తన భూమికి ఆధార్‌ అనుసంధానం కాకముందే చనిపోతే, ధరణిలో రికార్డు కావడంలేదు. ఇలాంటి సందర్భాల్లో వారసులకు ఆధార్‌ సీడింగ్‌చేస్తే ఊరట దక్కుతుందని ఓ రైతు సూచించారు.
 • ఆధార్‌ సీడింగ్‌ సమయంలో కొన్నిసార్లు భార్యకు బదులుగా భర్త ఆధార్‌ నంబర్‌ను అనుసంధానంచేశారు. దీంతో లింక్‌ డాక్యుమెంట్లలో భార్య పేరు కనిపిస్తుండగా, ధరణిలో భర్తపేరు కనిపిస్తున్నది. ఇప్పుడు దానిని మార్చే అవకాశం లేకపోవడంతో క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకోసం ప్రత్యేక ఆప్షన్‌ ఇవ్వాలని ఓ విశ్రాంత అధికారి కోరారు.
 • రైతుల పేర్లు ఒకేలా ఉంటే ఒక రైతుకు చెందిన భూమి మరొకరి ఖాతాలో జమ అవుతున్నది. క్షేత్రస్థాయిలో దరఖాస్తులను తీసుకొని వీటిని పరిష్కరించేందుకు ఆప్షన్‌ ఇస్తే బాగుంటుందని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ అభిప్రాయపడ్డారు.
 • ఒక భూమిని ఇద్దరు ముగ్గురు కలిసి కొనుగోలుచేసే అవకాశం (సింగిల్‌ టు మెనీ డాక్యుమెంట్‌) ధరణిలో లేదు. కుటుంబ యజమాని తన భూమిని సంతానానికి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే ఒకే డాక్యుమెంట్‌ మీద ఇచ్చే అవకాశం లేదు. ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో అన్ని డాక్యుమెంట్లు, అన్ని స్లాట్లు బుక్‌ చేసుకోవాల్సి వస్తున్నది. ఈ సమస్యను పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వినియోగదారుడు ప్రభుత్వానికి సూచించారు.
 • అసైన్డ్‌ భూమి పొందిన వ్యక్తి గతంలో మరణిస్తే.. ఆయన వారసులకు సక్సెషన్‌ చేసే అవకాశం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని పలువురు అసైన్డ్‌ భూ హక్కుదారులు కోరుతున్నారు.
 • బై సర్వే నంబర్లు లేని కాలంలో ఆ సర్వే నంబర్‌లోని కొంత భూమిపై న్యాయవివాదం ఉంటే మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో ఉంచారు. దీంతో మిగతా రైతుల క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలా కాకుండా ఎంత విస్తీర్ణం మీద వివాదం ఉన్నదో ఆ మేరకు మాత్రమే నిషేధిత జాబితాలో ఉంచేలా మార్పులు చేయాలని పలువురు వినియోగదారులు కోరారు.
 • గతంలో కొందరు సీలింగ్‌ భూమిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. మిగతా భూమికి పట్టా ఉన్నది. అప్పట్లో సీలింగ్‌ భూమికి బై నంబర్‌ కేటాయించకపోతే, ఇప్పుడు ఆ సర్వే నంబర్‌ మొత్తం నిషేధిత జాబితాలో కనిపిస్తున్నది. ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తే తమకు మేలు జరుగుతుందని ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు విజ్ఞప్తిచేస్తున్నారు.
 • భూమి విస్తీర్ణం రికార్డుల్లో తక్కువగా నమోదైతే దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం లేదు. అందులో తగ్గిన భూమి ఎవరి పేరుమీదికి చేరిందో చెక్‌ చేసే వ్యవస్థ లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆప్షన్‌ ఇస్తే బాగుంటుందని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు.
 • కొన్ని సర్వే నంబర్లు పొరబాటున అర్బన్‌ ల్యాండ్స్‌గా నమోదయ్యాయి. వాటికి నాలా కన్వర్షన్‌ మాత్రమే అవకాశం ఉన్నది. దానిని తిరిగి వ్యవసాయ భూమిగా మార్చుకొనే అవకాశం ఉండాలని ఓ రైతు కోరారు.
 • కొన్ని సర్వే నంబర్లలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు వ్యక్తులకు చెందని భూమిని గతంలో గుర్తించారు. వీటిని 0 లేదా ఏదో ఒక అంకె లేదా శ్రీ అని రికార్డ్‌ చేశారు. వాటిని పరిష్కరించే వ్యవస్థ లేదు. వాస్తవానికి ఆ భూమి ఆ సర్వే నంబర్‌లోని రైతులకు చెందినదే. రికార్డులను సరిచేస్తే తిరిగి వారి ఖాతాలోకి చేరే అవకాశం ఉంటుందని రిజిస్ట్రేషన్‌ విభాగం అధికారులు అంటున్నారు.
 • భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పట్టాదారుగానీ, కబ్జాదారుగానీ హాజరుకాకుంటే వాటిని ‘మిగులు భూములు’గా గుర్తించారు. ఇప్పుడు రైతులు తమ భూములను ధరణిలో చేర్చాలని తగిన ఆధారాలతో అధికారులను కోరుతున్నారు. వీటిని సెటిల్‌చేయడానికి ఆప్షన్‌ ఇవ్వాలని కోరుతున్నారు.
 • భూముల ప్రక్షాళన సమయంలో బయోమెట్రిక్‌, ఆధార్‌ వివరాలు ఇవ్వనివారి భూములు ఇప్పుడు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయి. వాటిని తొలిగించేందుకు ఆప్షన్‌ ఇస్తే పేద రైతులకు ఊరట దక్కుతుందని ఓ అధికారి సూచించారు.
 • ధరణి పోర్టల్‌ నుంచి సర్టిఫైడ్‌ కాపీలు పొందే అవకాశం లేకపోవటంతో కోర్టు కేసులు, ఇతర సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువరు బాధితులు అంటున్నారు.
 • ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం సేకరించిన భూముల వివరాలు కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో వాటికి కూడా క్రయవిక్రయాలు జరిగాయి. దాంతో ప్రభుత్వం వాటిని నిషేధిత జాబితాలో ఉంచింది. అయితే కొందరు అధికారుల తప్పిదం వల్ల భూమి కోల్పోని రైతుల సర్వే నంబర్లు కూడా నిషేధిత జాబితాలో చేరాయి. వీటిని పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana