బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 16:38:35

కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధురాలు

కరోనాను  జయించిన 93 ఏళ్ల వృద్ధురాలు

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు  ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌లో 93 ఏళ్ల వృద్ధురాలు కరోనాను జయించడం కరోనా బాధితుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. వివరాల్లోకెళితే.. కరోనా బారిన పడిన 93 ఏళ్ల వృద్ధురాలు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తాజాగా ఆమెకు టెస్టులు నిర్వహించగా.. నెగిటీవ్ అని తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా ఈ వయసు వారికి కరోనా సోకితే తట్టుకోవడం కష్టమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటిది ఆమె కరోనాను జయించడంతో ఆమె కుటంబ సభ్యుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

అయితే వృద్ధురాలి తనయుడికి, ఆమె మనవళ్లకు కూడా కరోనా సోకింది. గత వారం రోజుల క్రితం వృద్ధురాలి కొడుకు కరోనా కారణంగా చనిపోయాడు. మనవళ్లు ఇద్దరు ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈమె మాత్రం వృద్ధురాలు కావడంతో వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. అయితే, ఆమెను ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లమని, మరోసారి టెస్టుల్లో నెగిటీవ్ అని తేలిన తరువాతే ఇంటికి తీసుకెళ్తామని వృద్ధురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైద్యులు వారి డిమాండ్‌ను అంగీకరించారు.


logo