ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:58:05

రాష్ట్రంలో 90% చిన్న రైతులే

రాష్ట్రంలో 90% చిన్న రైతులే

  • దాని చుట్టూనే మనుషుల జీవితం
  • మండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘గతంలో జరిగిన విషయాలు, చట్టం గురించి తెలియక, అవగాహన లేక కొంతమంది బయట అవాకులు, చవాకులు మాట్లాడుతున్నరు. ఈ చట్టం భూస్వాములకు మేలు చేసేదని అంటున్నరు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ భూములు లేవు.. సాములు లేరు. ఇది కఠోర సత్యం. మొత్తం రైతుల్లో 98.38 శాతం మంది పదెకరాల్లోపు భూమి కలిగిన వారే. ఇదీ తెలంగాణ రైతుల స్వరూపం. గతంలో మాదిరిగా తెలంగాణలో ఇప్పుడు భూస్వాములు, జాగీర్దారులు, జమీందార్లు, పాత నవాబులు లేరు. ఇవి అధికారిక గణాంకాలు. 

ఈ వివరాల ఆధారంగానే రూ.7,279 కోట్ల రైతుబంధును రైతులకు అందించినం. ఇప్పటివరకు రైతులదరికీ రైతుబంధు వేసినం. ఎవరికి ఎంత వేసిందీ లెక్క ఉన్నది. ఆర్థికశాఖ, వ్యవసాయశాఖ, బ్యాంకులు.. ఇలా మూడు దిక్కుల నుంచి రైతులకు మేసేజ్‌లు ఇచ్చినం. వివరాలన్నీ స్పష్టంగా మన ముందున్నయి. ఒకరి డబ్బులు ఒకరికి మాత్రం రాలేదు. ఎక్కడి నుంచి కూడా ఒక్క ఫిర్యాదు రాలేదు. నేనే స్వయంగా అధికారులను, వ్యవసాయ శాఖ మంత్రిని పిలిచి అందరికీ రైతుబంధు పోవాలని చెప్పిన. ఇక భూములు వివాదాల్లో.. పార్ట్‌-బీలో ఉంటే మేమేం చేయలేం. కోర్టులో ఉండగా మేమేం చేయలేం. అలాంటి వాళ్లకు తప్ప మిగతా అందరికీ రైతుబంధు డబ్బులు వెళ్లినయి. దీన్నిబట్టి రైతు స్వరూపం తెలిసిపోతున్నది. ఎవరిని అందాం భూస్వామని? రెండెకరాలున్నోడినా? మూడెకరాలున్నోడినా? రాష్ట్రంలో 90.75% మంది రైతులకు ఐదెకరాల లోపే భూమి ఉన్నది. 7.5 ఎకరాల లోపు భూమి ఉన్నోళ్లు 96% ఉన్నారు’ అని సీఎం తెలిపారు.

భూమే ప్రధాన ఉత్పత్తి సాధనం

‘భూమికి సంబంధించి ఇవి కొత్త సంస్కరణలేమీ కావు. రైతులు సంఘటితంగా వ్యవసాయం చేయడం ప్రారంభించినప్పటి నుంచి భూమికి విలువ, ప్రాధాన్యం పెరిగింది. భూమి ఒక ప్రధాన ఉత్పత్తి సాధనంగా మారింది. మనుషుల జీవితమే దానిచుట్టూ తిరిగేలా అయింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. సోమవారం మండలిలో రెవెన్యూ బిల్లులపై చర్చ అనంతరం ఆయన సమాధానమిస్తూ.. ‘అక్బర్‌ మన దేశాన్ని పాలించే సమయంలో అయన దగ్గర పనిచేసే తోడర్‌మల్‌ అనే వ్యక్తి ఈ రెవెన్యూ సంస్కరణలు తెచ్చారు. 

ఆ తర్వాత షేర్‌షాసూరీ కాలంలో కొన్ని పద్ధతులు తీసుకొచ్చారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో అసఫ్‌జాహీల కాలంలో మొదటి సాలార్‌జంగ్‌ గొప్ప సంస్కరణాభిలాషి, ఆలోచనలు కలిగి ఉన్నవాడు. ఆయన కాలంలో చాలా రెవెన్యూ సంస్కరణలు వచ్చాయి. ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ వారి నుంచి వచ్చిందే. ప్రతిగ్రామంలోనూ ఓ అధికారి ఉండాలనే భావనతో పటేల్‌ పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చారు. భూమిశిస్తును వారితోనే వసూలు చేయించేవారు. ఈ భూమిశిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. చిన్న పైసల్‌పట్టి, కమిజఫా, జమాబందీ, థాయ్‌బందీ అని అనేక రకాలతో పన్నులను పిలిచేవారు. ఒకప్పుడు భూమే ప్రధాన ఉత్పత్తి సాధనం. దాని చుట్టే అంతా బతికేవారు. 96 నుంచి 97% ప్రజలు వ్యవసాయదారులుగా లేదా వ్యవసాయ కూలీలుగా, వృత్తిపనివారిగా బతికేవారు. అతికొద్ది మంది ఉద్యోగాలు చేసేవారు. 

మరికొద్ది మంది ముఖ్యంగా వైశ్యులు వ్యాపారాన్ని వృత్తిగా స్వీకరించారు. ఇందులో భాగంగానే రెవెన్యూ యాక్టివిటీ వచ్చింది. హైదరాబాద్‌ స్టేట్‌గా ఉన్నప్పుడు మన ైస్టెల్‌ వేరు. నాటి ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి రెవెన్యూలో అనేక రకాల పరివర్తనలు తీసుకొచ్చారు. నాటి సంస్కరణలే చాలా ఏండ్లు కొనసాగాయి. ఎన్టీఆర్‌ సీఎం అయిన తర్వాత 1985లో పటేల్‌ పట్వారీ వ్యవస్థను తీసేశారు. ఆ తర్వాత విలేజ్‌ అసిస్టెంట్స్‌ పోస్టును ఏర్పాటు చేశారు. చంద్రబాబు సీఎం అయినప్పుడు 2002లో పంచాయతీరాజ్‌, రెవెన్యూశాఖను కలిపేశారు. రాజశేఖర్‌రెడ్డి సీఎం అయినంక 2007లో మళ్లీ పంచాయతీరాజ్‌ శాఖను, రెవెన్యూ శాఖను వేరుచేశారు. వీఆర్వో పోస్టును ఏర్పాటు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు వీఆర్వో వ్యవస్థ కొనసాగింది.


logo