ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:57:21

వండర్‌బాయ్‌ ఆ బుడతడు

వండర్‌బాయ్‌ ఆ బుడతడు

  • ఒక్కసారి చూస్తే ఎప్పటికీ చూసినట్టే..
  • ఒక్కసారి వింటే లక్షసార్లు విన్నట్టే
  • ఏడాదిన్నర వయస్సే..
  • కానీ ఏదీ మరచిపోడు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సహా నాలుగు రికార్డులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆ బాబు వయస్సు 18 నెలలే.. కానీ ఒక్కసారి ఏదైనా చూసినా, ఏమైనా విన్నా ఇక మరచిపోడు. దేవతల పేర్లు, ప్రపంచ దేశాల జాతీయపతాకాలు, పశుపక్షాదులు, క్రూరమృగాలు, సాధుజంతువులు, పండ్లు, కార్ల లోగోలు, వృత్తులు, శరీరభాగాలు, ఇంగ్లిష్‌ అక్షరాలు, సంఖ్యలు ఇలా ఒకటేమిటీ ఏదంటే అది టపీ టపీమని చెప్పేస్తాడు. అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉన్న ఈ బాలుడి పేరు ఆదిత్‌ విశ్వనాథ్‌ గౌరిశెట్టి. హైదరాబాద్‌కు చెందిన ఈ బుల్లోడు ఇప్పటికే వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తోపాటు మరో నాలుగు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ‘ఈ వయస్సున్న పిల్లలందరూ బొమ్మలతో ఆటలాడుతూ, మొబైల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఆదిత్‌ మాత్రం ఇప్పుడే తన ప్రతిభతో మమ్మల్ని పదిమందికి పరిచయం చేస్తున్నాడు’ అని ఆ బాబు తల్లి స్నేహిత పేర్కొన్నారు. ఒకసారి ‘ఇది మన జాతీయ పతాకం’ అని చెప్పాం. అంతే ఢిల్లీలో ఎర్రకోట మీద ప్రధానమంత్రి మోదీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయజెండా ఎగురవేసినప్పుడు టీవీలో చూసి నేషనల్‌ ఫ్లాగ్‌ అని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపోయాం’ అని ఆమె తన బిడ్డ అసాధారణ జ్ఞాపకశక్తిని గూర్చి వెల్లడించారు. తన కుమారుడి ప్రతిభను మొదట గుర్తించింది అతని నానమ్మ అని, ఆదిత్‌ తండ్రి అరుణ్‌గౌరిశెట్టి చెప్పారు. నానమ్మతో పూజగదిలో సాయిబాబా, వెంకటేశ్వరస్వామి చిత్రపటాల దగ్గర ఆ దేవుళ్ల పేర్లు చెప్పటంతో ఆశ్చర్యం వేసిందని తెలిపారు. ఈ వయస్సున్న పిల్లల్లో ఇంతటి అసాధారణ జ్ఞాపకశక్తి ఉండటం అరుదు అని, ఇది చాలా మందికి స్ఫూర్తినిస్తుందని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రకటించింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌తోపాటు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, మరో రెండు జాతీయ రికార్డ్‌ సంస్థలు తమ పుస్తకాల్లో ఈ వండర్‌బాయ్‌ను చేర్చుకున్నాయి. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆదిత్‌ విశ్వనాథ్‌ స్వస్థలం కరీంనగర్‌.


logo