గురువారం 09 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:25:15

209 మందికి కరోనా

209 మందికి కరోనా

  • జీహెచ్‌ఎంసీలోనే 175 మందికి వైరస్‌
  • 9 మంది మృతి.. 176 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఎప్పుడూ లేనివిధంగా గురువారం 209 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 175 నిర్ధారణ కాగా, మేడ్చల్‌ 10, రంగారెడ్డి 7, వరంగల్‌ అర్బన్‌ 2, మహబూబ్‌నగర్‌ 3, ఆసిఫాబాద్‌ 2, సిద్దిపేట 2, కరీంనగర్‌ 3, ములుగు 1, కామారెడ్డి 1, వరంగల్‌ రూరల్‌ 1, సిరిసిల్ల జిల్లాలో 1 ఉన్నాయి. ఒకరు వలస కార్మికుడు ఉన్నారు. వైరస్‌ తీవ్ర ప్రభావం, ఇతర కారణాలతో 9 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఇందులో 165 మంది మృత్యువాత పడ్డారు. 1,993 మంది చికిత్స ద్వారా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 2,162 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య (ఎస్‌ఏఆర్‌ఐ)తో దవాఖానలకు వస్తున్నవారిని గుర్తించడంపై ప్రజారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ 10 వరకు శ్వాస సంబంధ సమస్యలతో 6,160 మంది రాగా, ఇందులో 472 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 10 రోజుల్లో శ్వాస సంబంధ సమస్యతో వచ్చినవారిలో 24శాతం మందికి కరోనా సోకడం కలవర పెడుతున్నది. కరోనా పరీక్షలకు వైద్యవిభాగాలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం ప్రకారం 13 లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేయాలని సూచిస్తున్నారు. వీటితోపాటు తాజాగా మరో రెండు వాసన, రుచిని గుర్తించలేకపోవడాన్ని కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది.

హోంక్వారంటైన్‌లో మేయర్‌, ఇద్దరు కలెక్టర్లు

జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కారు డ్రైవర్‌కు కరోనా వచ్చింది. దీంతో మేయర్‌ సహా ఆయన కుటుంబసభ్యులు హోంక్వారంటైన్‌లో ఉన్నారు. శుక్రవా రం వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ జిల్లాస్థాయి అధికారి, ఆయన భార్యకు కరోనా సోకింది. దీంతో కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌తోపాటు కలెక్టరేట్‌, జెడ్పీ కార్యాలయ అధికారులు, సిబ్బంది 35 మంది హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి హోంక్వారంటైన్‌కు వెళ్లారు. 

వైరస్‌ సోకిన జర్నలిస్టులకు సాయం: అల్లం నారాయణ

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిన 11 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున ఆర్థికసాయాన్ని మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ ప్రకటించారు. ఆయా జర్నలిస్టుల బ్యాంకు ఖాతాలో సొమ్మును జమచేస్తామని గురువారం తెలిపారు. ఇప్పటికే వైరస్‌ సోకిన 30 మంది జర్నలిస్టులకు రూ.20 వేల చొప్పున రూ.6 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశామని చెప్పారు. హోంక్వారంటైన్‌లో ఉన్న 13 మంది జర్నలిస్టులకు రూ.10 వేల చొప్పున రూ.1.30 లక్షలు అందించామని వివరించారు.


logo