మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 00:40:48

విస్తారంగా వానలు

విస్తారంగా వానలు

  • పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీగా..
  • పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • అత్యధికంగా పేరూరులో 8 సెంటీమీటర్ల వర్షం
  • సాగు పనుల్లో రైతన్నలు బిజీ

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: ఉపరితల ఆవర్తనంతో ఆదివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో వాగులు, వంకల్లోకి వరద నీరు చేరింది. చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వానల రాక తో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో కిన్నెరసాని, మల్లన్నవాగు, ఏడుమలకల వాగు, దున్నపోతుల వాగు, తొట్టివాగులు నిండుగా పారుతున్నాయి. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల పరిధిలోని మొర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఖమ్మం నగరంతోపాటు రూరల్‌ మండలంలోని మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తున్నది. దుమ్ముగూడెం మండలం గంగోలు-లక్ష్మీనగరం మధ్య భారీ వృక్షం నేలకూలడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని పలు వాగులు ఉప్పొంగాయి. శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. కేతిని నుంచి దిందాకు వెళ్లే వాగు పొంగిపొర్లగా, కౌటాల నుంచి రణవెల్లి గ్రామ పక్క నుంచి వెళ్లే వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబాద్‌ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. పట్టణ శివారు మున్నేరు వాగు బయ్యారం మండలంలోని పెద్ద చెరువు పొంగి ప్రవహిస్తున్నాయి. వరంగల్‌ అర్బన్‌, జనగామ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. కరీంనగర్‌ జిల్లాలో ఆదివారం సాయం త్రం భారీ వర్షంగా కురిసింది. దాదాపు అరగంటపాటు దంచికొట్టడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటలో భారీ వర్షం పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. 

వర్షపాతం వివరాలు ఇలా..

శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 వరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పేరూరులో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాళేశ్వరం, వెంకటాపురంలో 7 సెంటీమీటర్ల చొప్పున, ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడిలో, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్‌లో, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో 3.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లాలో 3.6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.


logo