హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో 894 ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ ఆదేశాలు జారీచేసింది. 25 మెడికల్ కాళేజీల్లో కాంట్రాక్టు సర్వీసెస్‌లో 573 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 40 ట్యూటర్ పోస్టులు, ఔట్సోర్సింగ్ సర్వీసెస్‌లో గ్రేడ్-2 ఫార్మాసిస్టులు 79, గ్రేడ్-2 ల్యాబ్ టెక్నిషియన్లు 202 పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్ కమిటీ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను భర్తీచేస్తారు. ఈ ఉద్యోగాల్లో చేరినవారు 2022 మార్చి 31 వరకు లేదా అవసరం ఉన్నంతకాలం కొనసాగుతారని ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌రోస్ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాల్లోని తెలంగాణ డయాగ్నస్టిక్స్‌లో 76 ఉద్యోగాల రెగ్యులర్ ప్రాతి పదికన భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బయోకెమిస్ట్, పాథాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్.. 19 చొప్పున మొత్తం 76 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వైద్యారోగ్యశాఖ-ప్రజారోగ్య విభాగంలో 476 పోస్టులను కాంట్రా క్టు, ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీచేసేందుకు ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కాంట్రాక్టు ప్రాతిపాదికన 264 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన 86 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 126 కలిపి మొత్తం 476 పోస్టులను భర్తీ చేయనున్నారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగంలో వీరు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు లేదా అవసరం ఉన్నంతవరకు వీరి సేవలను వినియోగించుకుంటారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.