శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 00:22:45

సిమ్‌ స్వాపింగ్‌తో 86 లక్షలు స్వీప్‌

సిమ్‌ స్వాపింగ్‌తో 86 లక్షలు స్వీప్‌

  • బిట్‌ కాయిన్స్‌గా నైజీరియాకు..
  • కోల్‌కతాకు చెందిన ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ: సిమ్‌ స్వాపింగ్‌తో రూ. 86 లక్షలు దోచి, డబ్బును బిట్‌ కాయిన్స్‌ రూపంలో నైజీరియాకు పంపుతున్న  ముఠాను సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాశ్‌ మహంతి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి డీసీబీ బ్యాంకులో మూడు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలుండగా.. అవన్నీ తన మెయిల్‌, మొబైల్‌నంబర్‌కు లింక్‌ చేసి ఉన్నాయి. గత నెల 5 నుంచి మొబైల్‌ నంబర్‌ పనిచేయలేదు. 20వ తేదీన నంబర్‌ను రీ యాక్టివేట్‌ చేయించగా.. ఓటీపీలకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ ఏకధాటిగా వచ్చాయి.  అనుమానం వచ్చి బ్యాంకుకు వెళ్లి ఖాతాల్లో బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోగా.. ఈ మూడు ఖాతాల నుంచి దాదాపు రూ.50 లక్షలు బదిలీ అయ్యాయని తేలింది. 

వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  ఇదే తరహాలో మరో వ్యాపా రి రూ. 36 లక్షలు కోల్పోయాడు. సిమ్‌ స్వా పింగ్‌తో మోసం జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాధితుల ఖాతాల నుంచి బదిలీ అయిన అకౌంట్ల వివరాలు సేకరించారు. ఈ కేసులో కోల్‌కతాకు చెందిన సాగర్‌మహతో, కుమార్‌గౌరవ్‌సింగ్‌, సంజయ్‌ అగర్వాల్‌ను ట్రాన్సిట్‌ వారెంట్ల మీద అరెస్టు చేశారు. ఇదే తరహాలో సిమ్‌స్వాపింగ్‌తో ముంబైకి చెందిన వ్యాపారి ఖాతా నుంచి రూ 2 కోట్లు కొట్టేసినట్టు సంజయ్‌ మహతో ఒప్పుకొన్నాడు. ఈ ముఠాకు నాయకుడు నైజీరియాకు చెందిన షెడ్రిక్‌పాల్‌గా పోలీసులు గుర్తించారు. వీరంతా తమ ఖాతాలకు వచ్చిన నగదును 20 % కమీషన్‌గా తీసుకొని బిట్‌కాయిన్‌ రూపంలో షెడ్రిక్‌కు పంపుతున్నట్టు పోలీసులు నిర్ధారించారు.

ఏమిటీ సిమ్‌ స్వాపింగ్‌? 

వైరస్‌తో కూడిన లింక్‌ను సృష్టించడం.. వాటిని వేలాది మందికి మెయిల్స్‌, వాట్సా ప్‌, ఎస్సెమ్మెస్‌గా పంపిస్తారు. తెలియకుం డా దానిని క్లిక్‌ చేయడం ద్వారా వైరస్‌ మన ఫోన్‌, కంప్యూటరలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్‌ స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌లో జరిగే లా వాదేవీలన్నింటినీ సైబర్‌ నేరగాళ్లకు చూపుతుంది. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలను వారు పరిశీలిస్తారు. మెయిల్స్‌తోపాటు ఫోన్‌ నంబర్ల వివరాలను సేకరిస్తారు. తమ ఏజెంట్ల ద్వారా సిమ్‌కార్డ్స్‌ అవుట్‌లెట్‌లో కొత్త సిమ్‌ కార్డుల కోసం దరఖాస్తు చేయిస్తారు. బాధితుడికి తెలియకుండానే ఫోన్‌ డిస్‌ కనెక్ట్‌ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించేలోపే ఖాతా ఖాళీ అయిపోతుంది.