ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:18:16

వేగంగా జీహెచ్‌ఎంసీ అభివృద్ధి

వేగంగా జీహెచ్‌ఎంసీ అభివృద్ధి

  • త్వరలోనే పేదలకు 85 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
  • గ్రేటర్‌ హైదరాబాద్‌ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక డ్రైవ్‌
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా నిర్వహిస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోచేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై శుక్రవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆయా నియోజకవర్గాల్లో జీహెచ్‌ఎంసీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రజల స్పందనను ఆడిగి తెలుసుకున్నారు. త్వరలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను సైతం వారికి వివరించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. త్వరలోనే జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 85 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పేద ప్రజలకు అందుతాయని తెలిపారు. ఇందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కూడా వేగవంతంచేయాలని జీహెచ్‌ఎంసీ, జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశామని పేర్కొన్నారు. పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక డ్రైవ్‌చేపట్టామన్నారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ విషయంలోనూ సాగునీటిశాఖతో కలిసి సమన్వయంతో ముందుకుపోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న, ప్రజలు కోరుకుంటున్న మౌలికవసతులను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సహకరిస్తామని చెప్పారు. ఐదేండ్లుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలపైన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఎమ్మెల్యేలు కేటీఆర్‌కు వివరించారు. లాక్‌డౌన్‌ సమయంలో పెద్దఎత్తున రోడ్లను విస్తరించడం, నిర్మాణం ద్వారా ప్రజలలో మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, ప్రకాశ్‌గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబులెన్సు కోసం 20 లక్షల వితరణ 

మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా కరోనా వ్యాధిగ్రస్థుల సహాయార్థం ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రత్యేక ఆంబులెన్స్‌ కోసం రూ. 20.50 లక్షల చెక్కును శుక్రవారం ప్రగతిభవన్‌లోమంత్రి కేటీఆర్‌కు అందించారు. ఆయన వెంట చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఉన్నారు.

ఖాయిలా పరిశ్రమలకు అండగా హెల్త్‌క్లినిక్‌: మంత్రి కేటీఆర్‌ 

ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ (నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ) అద్భుతమైనదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం ట్విట్టర్‌లో తెలిపారు. మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమ (ఎమ్మెస్‌ఎంఈ)లను తెరిపించడానికి ఇది ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ టుడే ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వ్యాసాన్ని ఉటంకిస్తూ కేటీఆర్‌ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ను ప్రశంసించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రొఫెసర్‌ జయతిఘోష్‌ రాసిన వ్యాసం ఎంతో ఆసక్తిగా ఉన్నదని కేటీఆర్‌ పేర్కొన్నారు.


తాజావార్తలు


logo