సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 02:25:13

82.6% పోలింగ్‌

82.6% పోలింగ్‌

కరోనా భయం ఉన్నప్పటికీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటుహక్కును వినియోగించుకొన్న  నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో కష్టపడ్డ ప్రజాప్రతినిధులకు, టీఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలందరికీ, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా బీజేపీ గోబెల్స్‌ ప్రచారాలను చేస్తూ వచ్చింది. ఇవ్వని దాన్ని ఇచ్చినట్టు.. చేయనిదాన్ని చేసినట్టు.. ఝుటా  మాటలతో, కుట్రలతో, ధన ప్రవాహం,  ప్రలోభాలకు తెరలేపింది. చివరి రోజు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ఒక ఫేక్‌ న్యూస్‌ను క్రియేట్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని   పరాకాష్టకు తీసుకెళ్లింది.  - మంత్రి హరీశ్‌రావు

  • 10వ తేదీన ఓట్ల లెక్కింపు
  • ఉదయం నుంచే పోలింగ్‌  కేంద్రాలకు ఓటర్లు
  • చిట్టాపూర్‌లో ఓటేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాత
  • కొవిడ్‌ నిబంధనల మేరకుఓటర్లకు సౌకర్యాలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. రికార్డుస్థాయిలో 82.61 శాతం పోలింగ్‌ నమోదయింది. ఫలితాలు ఈ నెల పదోతేదీన వెలువడనున్నాయి. మొత్తం 1,98,807 మంది ఓటర్లలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఓటుహక్కును వినియోగించుకొన్నారు. 11 మంది కొవిడ్‌ రోగులు పీపీఈ కిట్లు ధరించి వచ్చి ఓటు వేశారు. వీరిని అంబులెన్సులో ప్రభుత్వ వైద్య సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చారు. మొత్తం 315 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. తర్వాత ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు పోలింగ్‌ జరిగింది. పోలింగ్‌ ముగిసే సమయానికి పోలింగ్‌ కేంద్రంలో ఉన్న వారందరికీ ఓటు వేసుకొనేందుకు అధికారులు అవకాశాన్ని కల్పించారు. ఉప ఎన్నికలో దివంగత సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేయగా.. మరో 22 మంది బరిలో ఉన్నారు. సోలిపేట సుజాత దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక మండలం పోతారంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటువేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 85.92 శాతం పోలింగ్‌ నమోదు కాగా ఈసారి 82.61 శాతానికి పరిమితమైంది. 

ఉదయం నుంచే ఓటెత్తారు..

ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావడంతోనే ఓటర్లు బారులుతీరారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌చైర్లు ఏర్పాటుచేయడంతో వారు ఓటుహక్కు ను వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటలకే 34 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకల్లా 71 శాతం పోలింగ్‌ జరిగింది. ఒకటిరెండు చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ.. ముందుగానే ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయడంతో పోలింగ్‌కు ఆటంకం కలుగలేదు. పోలింగ్‌ ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌, కలెక్టర్‌ భారతి హోళికేరి పర్యవేక్షించారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ భద్రతాఏర్పాట్లను పరిశీలించారు. అన్ని మండలాల్లో పర్యటించి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకొన్నారు. పోలింగ్‌ సరళిని ఆయా పార్టీల అభ్యర్థులు కూడా పరిశీలించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లను దుబ్బాకలోని లచ్చపేటలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌రూంకు తరలించి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. లచ్చపేట నుంచి సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలకు తరలిస్తారు. ఇక్కడే కౌంటింగ్‌ జరుగుతుంది. 

కొవిడ్‌ నిబంధనలు అమలు

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ ప్రక్రియ జరిగింది. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా గుర్తులను ఏర్పాటుచేశారు. ప్రతి ఓటర్‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటేషన్‌ చేసిన అనంతరం చేతులకు గ్లౌజులు ఇచ్చారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం పోలింగ్‌ కేంద్రం వద్ద బయట ఏర్పాటు చేసిన డస్ట్‌బిన్‌లో గ్లౌజ్‌లు పడేసేలా చర్యలు తీసుకొన్నారు. తాగునీటి వసతి, దివ్యాంగులకు వీల్‌చైర్లు, షామియానాలు వేశారు. పోలింగ్‌ సమయం ముగిసేవరకు కూడా ఓటర్లు ఉండటంతో పోలింగ్‌ కేంద్రంలోని వారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు. పోలింగ్‌లో సాంకేతికతను సమర్థంగా వినియోగించుకున్నారు. జీపీఎస్‌ ద్వారా సెక్టార్‌ అధికారుల సేవలను వినియోగించుకున్నారు. కంట్రోల్‌రూం నుంచి ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించారు. పోలింగ్‌ సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించిన అధికారులను సీఈవో శశాంక్‌ గోయల్‌ అభినందించారు. నిబంధనల మేరకు కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా చేసిన సురక్షిత పోలింగ్‌ ఏర్పాట్లు బాగున్నాయని ఓట ర్లు సంతోషం వ్యక్తం చేసినట్టు గోయల్‌ తెలిపారు. అక్కడక్క డ పోలింగ్‌ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వెం టనే స్పందించి సమస్యను పరిష్కరించామని జిల్లా ఎన్నికల అధికారి భారతి హోళికేరి అన్నారు. పోలింగ్‌ సజావుగా జరిగేందుకు ఓటర్లు పూర్తిగా సహకరించారన్నారు. ఉప ఎన్నికలకు సహకరించిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు సీపీ జోయల్‌ డేవిస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరగడానికి బందోబస్తు నిర్వహించిన వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ నెల 10న సిద్దిపేట జిల్లా పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు: మంత్రి హరీశ్‌రావు 

దుబ్బాక ఉప ఎన్నికల్లో కరోనా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకొన్న నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రజాప్రతినిధులకు, టీఆర్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలందరికీ, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు. ఎన్నో ఒత్తిడులు ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియను సంయమనంతో, సజావుగా జరిపించిన ఎన్నికల సంఘానికి, పోలీసు సిబ్బందికి, యావత్‌ జిల్లా యంత్రాంగానికి అభినందనలు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు రాష్ట్రం, జిల్లా నుంచి కరోనా ఉన్నా.. శ్రమిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో మొదటి నుంచి చివరి నిమిషం వరకు కూడా బీజేపీ గోబెల్స్‌, అబద్ధపు ప్రచారాలను చేస్తూ వచ్చింది. ఇవ్వని దాన్ని ఇచ్చినట్లు.. చేయనిదాన్ని చేసినట్టు.. ఝుటా మాటలతో, కుట్రలతో, అల్లర్లతో డబ్బుల ప్రవాహాలు, ప్రలోభాలకు తెరలేపింది. చివరి రోజు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఒక ఫేక్‌ న్యూస్‌ను క్రియేట్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాన్ని పరాకాష్టకు తీసుకెళ్లింది. ఎన్నికల రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో కరెంట్‌ కట్‌ చేసి దొంగ ఓట్లు వేస్తారని మా పార్టీపై అబద్ధపు ప్రచారానికి ఒడిగట్టడం హాస్యాస్పదం. బీజేపీ గెలిచిపోయింది అని తప్పుడు వాయిస్‌ కాల్స్‌ పంపుతూ ప్రజలను అయోమయంలో పడేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలు మూటలతో వచ్చి ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు తిప్పికొట్టారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీఆర్‌ఎస్‌ మంచి మెజార్టీతో గెలువటం తథ్యం. టీఆర్‌ఎస్‌ అంటే ప్రజలకు ఎంతో నమ్మకం, విశ్వాసం. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరించారు.