శనివారం 11 జూలై 2020
Telangana - May 27, 2020 , 01:47:48

కోలుకునేవరకూ చికిత్స

కోలుకునేవరకూ చికిత్స

  • వెంటిలేటర్లు స్వయంగా సమకూర్చుకుంటున్నాం
  • మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి
  • 100 వెంటిలేటర్లు అందజేసిన గ్రేస్‌ ఫౌండేషన్‌

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ:  కొవిడ్‌ రోగుల్లో వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నా.. వారు పూర్తిగా కోలుకునే విధంగా వైద్య విభాగాలు కృషిచేస్తున్నాయని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా చికిత్స, ఇతర అంశాలపై  మంత్రి మంగళవారం బీఆర్‌కే భవన్‌లో అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో కేసులు నమోదు కాకముందే చికిత్సకోసం అత్యంత వేగంగా ఏర్పాట్లు చేశామని చెప్పారు. కొవిడ్‌ దవాఖానలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకుని లక్ష మంది రోగులు వచ్చినా.. చికిత్స అందించగల యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచామన్నారు. గాంధీలో ఏర్పాట్లపై చర్చించిన మంత్రి అత్యవసర చికిత్స అవసరమైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విషమంగా ఉన్న వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబసభ్యులకు తెలియజేయాలన్నారు. 

గాంధీ దవాఖానకు 80 వెంటిలేటర్లు

కరోనా బారిన పడుతున్నవారిలో ఎక్కువమంది శ్వాస సంబంధిత సమస్య ఉన్నవారేనని,  వీరికోసం అధిక సంఖ్యలో వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాల్సి వస్తున్నదని  మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా కట్టడి కోసం వెయ్యి వెంటిలేటర్లు కావాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే వెంటిలేటర్లను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. వెంటిలేటర్ల తయారీకి డీఆర్డీవో ముందుకొచ్చిందని గుర్తుచేశారు. అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌, గ్రేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మైక్రాన్‌ సంస్థ ప్రతినిధులు మంత్రికి వంద వెంటిలేటర్లు, 5 వేల పీపీఈ కిట్లు, 5 వేల ఎన్‌-95 మాస్క్‌లు అందించారు. ఆయా సంస్థల ప్రతినిధులకు మంత్రి ఈటల కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానల్లో చేరినవారికి వెంటిలేటర్‌ సేవలందించేందుకు రోజుకు రూ.40వేల దాకా వసూలు చేస్తుండటంతో పేదలు అప్పులపాలవుతున్నారన్నారు. 

ప్రభుత్వ దవాఖానల్లో వెంటిలేటర్ల సంఖ్య పెరుగడం నాణ్యమైన వైద్యం అందించవచ్చన్నారు. వంద వెంటిలేటర్లలో గాంధీకి 80, ఉస్మానియాకు 10, చెస్ట్‌ దవాఖానకు 10 చొప్పున ఇస్తున్నామని గ్రేస్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ చినబాబు చెప్పారు. గాంధీకి అందజేసిన 80 వెంటిలేటర్ల ద్వారా అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో మైక్రాన్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ రాధిక, మేనేజర్‌ మురళి, అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌ స్టేట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ వినయ్‌, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు ఉన్నారు. 


logo