శనివారం 06 జూన్ 2020
Telangana - May 12, 2020 , 00:28:02

ఒక్కరోజే 79 కేసులు

ఒక్కరోజే 79 కేసులు

  • అన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదు
  • 50 మంది డిశ్చార్జి, 444 మందికి చికిత్స
  • ప్రతి జిల్లాలో వారానికి 200 ర్యాండమ్‌ టెస్టులు చేయాలి
  • కరోనా వైరస్‌ వ్యాప్తి గుర్తింపుపై కేంద్రం కీలక నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సోమవారం 79మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అ యింది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రత్యేక విధానాల కారణంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కొంత మేర తగ్గినప్పటికీ.. మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ కేసులన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,275కు చేరుకున్నది. ఇందులో ఇప్పటివరకు 30మంది మత్యువాత పడగా, 801 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మిగిలిన 444 మంది ప్రస్తుతం గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. సోమవారం 50 మంది డిశ్చార్జి అవగా, వీరిలో హైదరాబాద్‌కు చెందిన 42 మంది, సూర్యాపేట 4, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

ర్యాండమ్‌ టెస్టులు చేయాలి

రాష్ర్టాల్లో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి జిల్లాలో వారానికి కనీసం 200 మందికి ర్యాండమ్‌ టెస్టులు చేయించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతిజిల్లాలో ఆరు ప్రభుత్వ, నాలుగు ప్రైవేట్‌ దవాఖానలను ఎంపిక చేసి, అక్కడికి వస్తున్న 50 మంది ఔట్‌ పేషెంట్లు, 50 మంది గర్భిణులలో కరోనా అనుమానిత లక్షణాలు లేనివారి నుంచి శాంపిల్స్‌ సేకరించాలని పేర్కొన్నది. ఆయా జిల్లాల్లో ప్రతివారం వందమంది హెల్త్‌కేర్‌ వర్కర్లకు టెస్టులు చేయాలని ఆదేశించింది.

ఏపీలో కొత్తగా 38 కేసులు

ఏపీలో సోమవారం 38 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులసంఖ్య 2018కి చేరింది. ఇప్పటివరకు 998 మంది డిశ్చార్జి కాగా 48 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులటిన్‌లో తెలిపింది. ప్రస్తుతం 975 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 7409 శాంపిళ్లను పరీక్షించగా 38 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. అనంతపురంలో 8, చిత్తూరులో 9, గుంటూరులో 5, కృష్ణాలో 3, విశాఖపట్నంలో 3, నెల్లూరులో 1, కర్నూలులో 9 కేసులు నమోదయ్యాయి. సోమవారం కేంద్ర బృందం కర్నూలు జిల్లాలో పర్యటించింది. ఏయే ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారో సమీక్షించారు. 

రాష్ట్రంలో కేసుల వివరాలు

వివరాలు
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
79
1,275  
కోలుకున్న/డిశ్చార్జి అయినవారు
50
801
మరణాలు
-30
చికిత్స పొందుతున్నవారు
 -
444


logo