శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:00:12

ప్రస్తుత వ్యవస్థ లోపాల పుట్ట

ప్రస్తుత వ్యవస్థ లోపాల పుట్ట

 • వెంటాడుతున్న 76 రకాల సమస్యలు
 • ప్రతి గ్రామంలోనూ భూ వివాదాలు
 • ఎనిమిది దశాబ్దాలుగా చేయని సర్వే
 • సంస్కరణలు  రావడం తప్పనిసరి
 • నిపుణులు, అధికారుల అభిప్రాయం

పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న భూమిని ఎవడో ఆక్రమిస్తాడు.. ఇది నాదంటూ దౌర్జన్యం చేస్తాడు.. న్యాయం కోసం అధికారుల దగ్గరికి పోతే ఆ కాగితం లేదు.. ఈ కాగితం లేదంటూ కాళ్లరిగేలా తిప్పుతారు.. ఒకకాడ భూమి ఉండదు, ఇంకోకాడ పత్రాలుండవు. పోనీ రెండూ ఉన్నాయనుకుంటే ఏదో ఒక కొర్రీ. భూమి తక్కువగా ఉండటమో! భూమి మ్యాపు సరిగ్గా లేక లెక్క తేలకపోవటమో! జరుగుతుంది. ఇలాంటి సమస్యలు ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఎక్కడ చూసినా ఇలాంటి ఘటనలే. భూ చట్టాల నిపుణులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో భూమికి సంబంధించిన సమస్యలు 76 రకాలుగా ఉన్నాయట.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో భూ సంబంధ చట్టాలది 113 ఏండ్ల చరిత్ర. ఈ చట్టాలు ప్రజలకు మేలు కంటే, కష్టాలనే ఎక్కువగా మిగిల్చాయి. ఆ చట్టాలను మార్చేందుకు గతంలో అరకొర ప్రయత్నాలు జరిగినా ఫలితం దక్కలేదు. బూజు పట్టిన శతాబ్దాలనాటి చట్టాలను దులుపుతూ.. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బుధవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. నిజానికి మారుతున్న కాలం, పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలో, నిర్వహణలో, చట్టంలో మార్పులు రావాల్సిందే.. తప్పదు. కానీ, ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా ఎంతోమంది అష్టకష్టాలు పడుతున్నారు. ఆ లోపాలేంటి? తెచ్చి పెడుతున్న సమస్యలేంటంటే..

కొట్లాటలు, కేసులు..

 • కోనేరు రంగారావు కమిటీ అభిప్రాయం ప్రకారం ప్రతి గ్రామంలో కనీసం 100 నుంచి 200 వరకు భూ వివాదాలు, కేసులున్నాయి. 
 • ప్లానింగ్‌ కమిషన్‌ ప్రకారం 2 శాతం భూమికి సంబంధించిన వివాదాలున్నాయి. 
 • సివిల్‌ కోర్టుల్లో 66 శాతం కేసులు భూములకు సంబంధించినవే.
 • ఆర్డీవో, జేసీల వద్ద కనీసం 20 వేల రెవెన్యూ కేసులు ఉన్నట్టు అంచనా.
 • పీవోటీ చట్టం పరిధిలో 5 వేల వరకు కేసులు ఉన్నాయి. 
 • ఇవి కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ నలుగుతున్న కేసులకు లెక్కేలేదు.

సరళం.. సులువు..

ప్రపంచమే కుగ్రామంగా మారుతున్న ఆధునిక సాంకేతికత మన చేతిలో ఉంది. గతంలో రూ.10 చెక్కును బ్యాంక్‌లో జమ చేయాలంటే 10 రోజులు పట్టేది. ఇప్పుడు విదేశాల నుంచి క్షణాల్లో రూ.10 కోట్లయినా జమ చేసే సాంకేతికత వచ్చింది. అలాంటి సాంకేతికతను వాడి, భూక్రయవిక్రయాలకు సంబంధించి రికార్డుల్లో మార్పులు చేర్పులు, యాజమాన్య పుస్తకాలను వెంటనే ఇచ్చేలా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. కంక్లూజివ్‌ టైటిల్‌ అనేది ఇస్తే భూమిని కలిగినవారు తమ గుండెలపై చేతులు వేసుకుని నిశ్చింతగా నిద్రపోతారు. ఇప్పుడు కేసీఆర్‌ సర్కారు చేయబోతున్నది అదే. అంటే.. భూములు చేతులు మారినప్పుడల్లా వెంటనే రికార్డులు మారుతాయి. సంపూర్ణ భూమి యాజమాన్య హక్కు పత్రం ఇస్తారు. ఎలాంటి వివాదం తలెత్తినా సర్వే ఉంటుంది. అందుకు వ్యవస్థ ఉంటుంది. వివాదాలను సత్వరం పరిష్కరించేలా కొత్త చట్టం ఉంటుంది.

 • భూమికి నాలుగు వైపులా సరిహద్దులు, కొలతలు ఉండాలి. అవన్నీ సర్వే మ్యాప్‌ (పటం)లో ఉండాలి. ఎలాంటి అనుమానం వచ్చినా మ్యాప్‌ పట్టుకుని వెంటనే సర్వే చేసే అవకాశం ఉండాలి. 
 • ప్రస్తుత వ్యవస్థ: నిజాం పరిపాలనలో 80 ఏండ్ల క్రితం సర్వే చేశారు. ఇప్పటి వరకు మళ్లీ చేయలేదు. వాస్తవానికి ప్రతి 30 ఏండ్లకు ఒకసారి సర్వే చేయాలి. ఒక సిద్ధాంతం ప్రకారం ప్రతి 30 ఏండ్లలో భూమి చేతులు మారుతుందనేది నిపుణుల మాట. మరి అవన్నీ రికార్డుల్లోకి చేరుతున్నాయా? అంటే లేదని చెప్పాల్సిందే. ఊరికే  హద్దు రాళ్లు లేవు.. ఇక భూములకు సర్వే హద్దు రాళ్లు ఎక్కడున్నాయనేది ఇంకో ప్రశ్న. భూమిని కొలవాలన్నా.. ఎన్ని రోజుల, నెలలు, ఏండ్లు పడుతుందో చెప్పలేని దారుణ స్థితి అని భూ చట్టాల నిపుణుడు ఎం సునీల్‌కుమార్‌ తెలిపారు.
 • భూమికి సంపూర్ణ యాజమాన్య పత్రం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీనివల్ల ఎలాంటి వివాదాలు, సమస్యలు రావని, వచ్చినా అధికారికంగా నిర్ధారించే భూమి యాజమాన్య పత్రం కీలకంగా ఉండాలని అందరూ అనుకుంటారు.
 • ప్రస్తుత వ్యవస్థ: భూమికి యాజమాన్య పత్రం కోసం ప్రస్తుత చట్టం ప్రకారం రకరకాల కాగితాలను, ఫారాలను ప్రభుత్వం ఇస్తూ వస్తున్నది. దాదాపు 40రకాలకు పైగా రికార్డులున్నా ఈ భూమికి కచ్చితంగా మీరే యజమాని అని చెప్పేందుకు ఇవేవీ పనికిరావు. ఇతర దేశాల్లో భూమి టైటిల్‌ గ్యారంటీ అనేది ఉంది. అదే ఫైనల్‌. అది ఇక్కడ లేదు. తమ భూములకు ప్రభుత్వమే జిమ్మేదార్‌గా ఉండాలని అంతా కోరుకుంటారు. టైటిల్‌ ఇన్సూరెన్స్‌ ఉండాలి. ఒకవేళ నష్టం జరిగితే సర్క్రా జరిమానా చెల్లించాలి. ఇలాంటి అంశాలతో సంపూర్ణంగా ‘కంక్లూజివ్‌ టైటిల్‌' ఉండాలనుకుంటారు. కానీ ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థలో అది లేదు.

ఒక వ్యక్తి భూమిని కొన్నా, అమ్మినా చేతులు మారుతుంది. అది వెంటనే రికార్డుల్లో కనిపించాలి.

 • ప్రస్తుత వ్యవస్థ: భూమి కొనుగోలు, అమ్మకాలను రికార్డుల్లోకి చేర్చాలంటే అధికారికంగా, లీగల్‌గా జరిగే తంతుకు 3నెలల వ్యవధి ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఆ సమాచారం తాసిల్దార్‌కు వెళ్లాలి. దానిపై నోటీసులివ్వాలి. కనీసం 15 రోజులు కావాలి. ఎంక్వైరీ జరిగి, ఆర్డర్‌ పాసై రికార్డుల్లోకి ఎక్కాలి. ఆపై పాస్‌బుక్‌ ఇవ్వాలి. ఈ తతంగానికి కొన్నిసార్లు ఏండ్లు పడుతుంటుంది. చాలాచోట్ల చనిపోయినవారి పేర్లే పట్టాదారుగా ఉంటున్నాయి.
 • భూ వివాదం ఏర్పడితే తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో పరిష్కారం జరుగాలి.
 • ప్రస్తుత వ్యవస్థ: నంబరు కావడానికే నెలలు పడుతుంది. ఆర్డీవో ఎప్పుడు పిలుస్తారో? ఎంత కాలం పడుతుందో ఎవరికీ తెలియదు. 20, 30 ఏండ్ల నుంచి భూమి కోసం కొట్లాడుతున్న సంఘటనలు కోకొల్లలు. వివాద పరిష్కారం సత్వరం, తక్కువ ఖర్చుతో జరగాలి. ఆ పరిస్థితి ప్రస్తుతం లేదు. 


logo