బుధవారం 08 జూలై 2020
Telangana - May 25, 2020 , 02:21:02

నియంత్రిత సాగుకు 75 గ్రామాల మద్దతు

నియంత్రిత సాగుకు 75 గ్రామాల మద్దతు

 • సారు మాటే తమదనీ.. సాగుతూ చూపిస్తామని!
 • ఊరెనక ఊరు కదిలింది ఉమ్మడిగా ప్రతిజ్ఞ చేసింది 
 • నియంత్రిత సాగుకు 75 గ్రామాల మద్దతు
 • సిద్దిపేటలో సంచలనం 
 • స్ఫూర్తిగా గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక
 • గజ్వేల్‌లోనే 60  ఊర్ల తీర్మానం
 • దత్తత గ్రామం ఎర్రవల్లిదీ సీఎం మాటే

భవిష్యత్తు వట వృక్షమూ చిన్ని బీజంలోనే ఇమిడి ఉంటుంది. 

భారీ దిగుబడీ కొన్ని విత్తన గింజల్లోనే ఒదిగి ఉంటుంది.

వచ్చే పెను మార్పు కూడా తొలి అడుగులోనే దాగి ఉంటుంది. 

ప్రేరణగా నిలిచే చిరు చలనమే సంచలనానికి దారితీస్తుంది.

తెలంగాణలో ఇప్పుడు అలాంటి సంచలనమే చోటు చేసుకుంటున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదించిన నియంత్రిత సాగు విధానానికి తెలంగాణ రైతాంగం ముక్తకంఠంతో మద్దతు పలుకుతున్నది. సారు మాట వింటామని, సాగుబాటు మారుస్తామని రాష్ట్రవ్యాప్తంగా వందల పల్లెలు ఎక్కడికక్కడ ఒక్కుమ్మడిగా తీర్మానాలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వస్థలం ఉమ్మడి మెదక్‌, అందునా సిద్దిపేట జిల్లాలో ఊర్లకు ఊర్లు ఉత్సాహంతో కదులుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 75 గ్రామాల్లో రైతులు నియంత్రిత సాగు విధానం పాటిస్తామంటూ ప్రతిజ్ఞలు చేశారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామం ఎర్రవల్లి కూడా ఇందులో ఉన్నది.

తెలంగాణ రైతాంగం సరికొత్త సాగు పద్ధతికి మారాల్సిన తరుణం ఆసన్నమైందంటూ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రతిపాదనపై జిల్లా రైతుల్లో పెద్దఎత్తున చర్చ సాగుతున్నది.  మంత్రి హరీశ్‌రావు జిల్లాలో పలు చోట్ల అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం ఊరువెనక ఊరు కదిలింది. రైతులు ఎవరికి వారే నాయకులుగా మారి, గ్రామాల వారీగా స్వచ్ఛందంగా సదస్సులు ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పద్ధతిని ఆహ్వానిస్తూ తీర్మానాలు చేశారు. గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక తదితర నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పల్లెలు నియంత్రిత సాగుకు ముందుకువచ్చాయి. ప్రభుత్వం సూచించిన పంటలే వేస్తామని రైతులు ప్రమాణపత్రం సాక్షిగా మాట ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయరంగంలో రానున్న భారీ మార్పునకు ఇది తొలి అడుగు. రైతాంగ సాధికారతా విప్లవానికి రైతులే వేసుకుంటున్న పునాది ఇది. 

ఈ రైతుల మాటలే మార్పునకు సూచిక. 

ఈ ఊర్లే ఉజ్వల భవితకు వేదిక. 

పంట చేలే గిట్టుబాటు ధరల విప్లవానికి ప్రాతిపదిక!


సిద్దిపేట/మెదక్‌/నారాయణఖేడ్‌, నమస్తే తెలంగాణ: నియంత్రిత విధానంలో పంటలసాగుకు రాష్ట్రరైతాంగం సై అంటున్నది. ప్రభుత్వం సూచించిన పంటలనే సాగుచేసేందుకు గ్రామాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. రైతులు మూకుమ్మడిగా సమావేశాలు నిర్వహించుకుని ప్రభుత్వం చెప్పిన పంటలు వేస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం కోసం ఇప్పటివరకు ఏంచేసినా ఎంతో ముందుచూపుతో వ్యవహరించిందని.. ఏ నిర్ణయం తీసుకున్నా రైతు బాగుకోసమే చేసిందని.. ప్రస్తుతం నియంత్రిత పంటలసాగును కూడా అంతే ప్రణాళికతో అమలుచేస్తుందని రైతాంగం విశ్వాసంతో ఉన్నది. 

సమగ్ర వ్యవసాయ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. నియంత్రిత పంటల సాగుపై రైతుల్లో పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నది. ఏ పంట ఎన్ని ఎకరాల్లో వేయాలి.. దానిద్వారా వచ్చే లాభాలు.. తదితర అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. దీంతో స్ఫూర్తిపొందిన రైతులు ఏకమై ప్రభుత్వం చూపిన సాగుబాటులోనే నడుస్తామంటూ తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాలు నియంత్రిత పంటల సాగుపై ప్రతిజ్ఞలు చేశాయి. ఆదివారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఏకంగా 75 గ్రామాల రైతులు నియంత్రిత పంటలను సాగుచేస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో 73 గ్రామాలతోపాటు, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లోని ఒక్కోగ్రామం ఈ విధమైన తీర్మానాలు చేశాయి. ఇందుకు సంబంధించిన ప్రతులను సర్పంచ్‌లు, రైతులు కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులకు అందజేశారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని సీఎం కేసీఆర్‌ దత్తతగ్రామం ఎర్రవల్లి, హరీశ్‌రావు దత్తత గ్రామం నారాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్‌తోపాటు గజ్వేల్‌ నియోజకవర్గంలో 60, సిద్దిపేట నియోజకవర్గంలో 8, దుబ్బాక నియోజకవర్గంలో 5, మెదక్‌ జిల్లా నిజాంపేట మండ లం నస్కల్‌, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నిజాంపేటల్లో  రైతులు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ప్రభుత్వం సూచించిన నియంత్రి త సాగుకు అనుకూలంగా మెదక్‌ జిల్లా నస్కల్‌ రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి ప్రతి ని అందజేశారు. ఈ సందర్భంగా నస్కల్‌ రైతులను మంత్రి అభినందించారు. నియంత్రిత సాగు విధానానికి అనుకూలంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట రైతులు తీర్మానంచేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు రైతులను సన్మానించుకున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. 

ఎర్రవల్లి రైతులు ఏకగ్రీవం 

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన ఎర్రవల్లి  రైతులు నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో సాగుకు యోగ్యమైన భూమి 2,637 ఎకరాలు ఉండగా ఈ వానకాలంలో 224 ఎకరాల్లో వరి, 1,213 ఎకరాల్లో పత్తి, 960 ఎకరాల్లో కంది పంటను సాగుచేయాలని నిర్ణయించుకున్నారు. ఎర్రవల్లిలో తన సొంత ఖర్చులతో రైతువేదికను కట్టిస్తానని సీఎం కేసీఆర్‌ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. 

సిద్దిపేటలో 4,99,968 ఎకరాల్లో సాగు

సిద్దిపేట జిల్లాలో వరి, మక్కజొన్న, పత్తితోపాటు కూరగాయలను ఎక్కువగా సాగుచేస్తుంటారు. రాష్ట్రప్రభుత్వం జిల్లాలవారీగా వానకా లం సాగు వివరాలను తెలుపగా.. సిద్దిపేటలో అన్నిరకాల పంటలు కలిపి 4,99,968 ఎకరా ల్లో సాగు చేయనున్నారు. ఇందులో 2,73,401 ఎకరాల్లో పత్తి, 1,50,368 ఎకరాల్లో వరి, 70,120 ఎకరాల్లో కంది ఇతర పంటలు సాగుచేయాలని ప్రణాళిక రూపొందించారు. మక్కజొన్న పంటను సాగుచేయడం లేదు కానీ, స్వీట్‌కార్న్‌కు సంబంధించిన పంటకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇచ్చింది. నియంత్రిత పద్ధతిలో సాగుపై రెండ్రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. 

 • అదును కాలం వచ్చినా మొగులు కురియలేదు.. బోరు కింద నారు పోస్తే కరెంట్‌ ఎట్ల.. పంటకు పెట్టుబడి ఎట్ల.. ఇది మొన్నటిదాకా రైతు ఆవేదన.
 • పంటకు పెట్టుబడి వచ్చింది.. మొగులవంక చూడకుండా సాగునీరందింది.. 24 గంటల కరెంటు వచ్చింది.. ఇక ఏ పంట వేయాలి, ఎక్కడ అమ్మాలి, ఎంతకు అమ్మాలి.. ఇది నిన్నటి రైతు ఆలోచన.
 • నేడు రైతు మదిలో ఏ ఆలోచనా లేదు. ఏ పంట ఎంత మొత్తంలో వస్తుంది. ఏ ధరకు అమ్మాలి. ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుంది అనే ఆలోచనలన్నీ ప్రభుత్వమే చేస్తున్నది. అన్నదాతకు ఆదాయాన్ని పెంచడమే కాదు వ్యవసాయాన్ని పరిశ్రమగా తీర్చిదిద్దేందుకు సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకువచ్చింది.
 • పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇవ్వవట్టే.. ఎవుసానికి పుల్‌గా కరెంట్‌.. సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉండవట్టే.. సబ్సిడీపై వ్యవసాయపరికరాలు అందివ్వవట్టే.. ఎక్కడోఉన్న గోదావరినీళ్లు తెచ్చి ఊర్లల్ల చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నింపవట్టే.. ఇంక మాకేం కావాలె.. కేసీఆర్‌ సార్‌ చెప్పిన పంటేస్తం.. లాభాలు గడిస్తాం అంటూ నియంత్రిత పంటల సాగుకు మద్దతుగా ఊరెనక ఊర్లు కదులుతున్నయ్‌.. గ్రామాలకు గ్రామాలే ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నయ్‌..


సిద్దిపేట జిల్లాలో ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామాలు

గజ్వేల్‌: దాతర్‌పల్లి, కోమటిబండ, మక్తామాసాన్‌పల్లి, అక్కారం, రాగట్టపల్లి, అనంతరావుపల్లి.

మర్కూక్‌: శివారు వెంకటాపూర్‌, పాతూరు, దామరకుంట, ఎర్రవల్లి, అంగడి కిష్టాపూర్‌, ఇప్పలగూడెం, చేబర్తి, కర్కపట్ల, గణేశ్‌పల్లి.

జగదేవ్‌పూర్‌: అనంతసాగర్‌, తిమ్మాపూర్‌, తీగుల్‌, మందాపూర్‌, జంగారెడ్డిపల్లి, అంతాయిగూడెం, చాట్లపల్లి, రామచంద్రాపూర్‌, చిన్నకిష్టాపూర్‌, ఇటిక్యాల, దౌలాపూర్‌, కొత్తపేట, వెంకటాపూర్‌ పీటీ, తీగుల్‌ నర్సాపూర్‌, పలుగుగడ్డ, కోతపేట, రాయారం, పీర్లపల్లి, ధర్మారం, మందాపూర్‌, గొల్లపల్లి, ఎల్లాయిగూడ, బంగ్లావెంకటాపూర్‌, వట్టిపల్లి, బస్వాపూర్‌, మునిగడప, లింగారెడ్డిపల్లి, అలిరాజ్‌పేట, నిర్మల్‌ నగర్‌, కొండాపూర్‌.

ములుగు: బస్వాపూర్‌, జప్తిసింగాయిపల్లి, కొత్యాల.

కొండపాక: కొండపాక, విశ్వనాథ్‌పల్లి, వెలికట్ట, మంగోల్‌, కమ్మంపల్లి, దమ్మక్కపల్లి, దుద్దెడ, అంకిరెడ్డిపల్లి, జప్తినాచారం, మత్‌పల్లి, రవీంద్రనగర్‌.

నంగునూరు: నాగరాజుపల్లి, మైసంపల్లి.

నారాయణరావుపేట: ఇబ్రహీంపూర్‌.

సిద్దిపేట అర్బన్‌: మిట్టపల్లి, పొన్నాల.

సిద్దిపేట రూరల్‌: పెద్దలింగారెడ్డిపల్లి, రాంపూర్‌

చిన్నకోడూరు: చంద్లాపూర్‌.

దుబ్బాక: పర్శరాంపల్లి, పద్మనాభునిపల్లి, చేర్వాపూర్‌, వెంకటగిరితండా, చిన్ననిజాంపేట.

80 బృందాలతో అవగాహన

రాష్ట్రప్రభుత్వం సూచించిన సాగుప్రణాళికపై జిల్లా వ్యాప్తంగా 80 బృందాలతో రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు గ్రామస్థాయి వరకు ప్రణాళికను తీసుకెళుతున్నాం. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గకేంద్రాల్లో రైతుబంధు సమన్వయసమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులతో సదస్సులు నిర్వహించారు. తొలుత ఎర్రవల్లి గ్రామ రైతులు నియంత్రిత పద్ధతిలో సాగుచేస్తామని తీర్మానించారు. తర్వాత 11 మండలాల్లోని 73 గ్రామాల్లో రైతులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు.

-శ్రవణ్‌కుమార్‌, సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

సీఎం సార్‌ చెప్పేది రైతుల మేలు కోసమే 

సీఎం కేసీఆర్‌ సార్‌ ఏంచెప్పినా రైతుల మేలు కోసమే. గోదావరి జలాలు తీసుకవచ్చి మా చెరువులు నింపారు. ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేస్తాం. ఎప్పుడు ఒకేవిధంగా కాకుండా డిమాండ్‌ ఉన్న పంటలు వేయడంవల్ల లాభాలు వస్తాయి. మొక్కజొన్నకు బదులు పత్తి, కందిని సాగు చేస్తాం. 

- గుర్రం రాంరెడ్డి (పెద్దలింగారెడ్డిపల్లి) 

వానకాలంలో మక్కవేయం

ఈ వానకాలంలో మక్క వేయం. వరిలో దొడ్డురకాలకు బదులు సన్నరకాలను సాగుచేస్తాం. కందులను ప్రభుత్వమే మద్దతుధరకు కొంటుందని సీఎం కేసీఆర్‌ సార్‌ చెబుతుండు. అందుకే పత్తి, కంది పంటలను సాగుచేస్తాం. 

- చెరువు ఐలయ్య (నాగరాజుపల్లి) 

పత్తికి మంచిగ పైసలు వచ్చినయ్‌

ఎవుసాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ చాలా కష్టపడుతున్నరు. ఇంతకుముందు మొక్కజొన్న పత్తి వేసేది. పత్తి పంటకు మంచిగా పైసలు వచ్చినయి. మక్కలకు కోతుల బెడదతో ఒకింత, కత్తెర పురుగుతో మరింత నష్టపోయా. ఇకనుంచి అధికారులు చెప్పిన పంటనే సాగుచేస్తా. 

- సత్తయ్య (ఎర్రవల్లి)

సీఎం కేసీఆర్‌ నిర్ణయం హర్షణీయం 

రైతుల సంక్షేమం కోసం నియంత్రిత సాగు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ఈ విషయమై రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రైతు లక్షాధికారి కావాలని సీఎం లక్ష్యం. నియంత్రిత పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించి మద్దతు ధర లభించే పంటనే సాగుచేయాలని నిర్ణయిండడం గొప్ప నిర్ణయం. మా గ్రామ రైతులు వ్యవసాయాధికారులు చెప్పిన పంటలే వేస్తామని ప్రతిజ్ఞచేశారు.

- భాగ్య బిక్షపతి (సర్పంచ్‌, ఎర్రవల్లి)

ధీమాతో రైతు కుటుంబాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు నియంత్రిత పంటల సాగుకు ముందుకొచ్చి నస్కల్‌ గ్రామ ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేయడం సంతోషంగా ఉన్నది. ఈ యేడు వానకాలంలో మొక్కజొన్న పంటకు బదులుగా ప్రభుత్వం ఆదేశానుసారం కంది, పత్తి, సన్నరకం వరి పంటలను పండించేందుకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న గ్రామ రైతులను అభినందిస్తున్నాను. రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతు కుటుంబాలు ధీమాగా ఉన్నాయి.   

- మంత్రి హరీశ్‌రావు

 రైతుకు మేలే సర్కారు ధ్యేయం

అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అనే సామెత ఉన్నది. దీనిని మార్చాలి. రైతుల తలరాత రైతులే రాసుకోవాలి. ఎవ్వడో వచ్చి మనకు సాయం చేయడు. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నది. రైతులను పైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నది. ప్రభుత్వం సూచించే పంటలను పండించాలి. లాభాలు పొందాలి. నియంత్రిత పంటల సాగుచేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇది మంచి పరిణామం. ఈ విధానం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. పండిన పంటకు మంచి ధర వచ్చినప్పుడే రైతులకు లాభం. అందుకోసమే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నది. 

- నియంత్రిత సాగుపై సీఎం కేసీఆర్‌


logo