ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 02:44:02

జీహెచ్‌ఎంసీలో 85,000 ఇండ్లు

జీహెచ్‌ఎంసీలో 85,000 ఇండ్లు

  • డిసెంబర్‌కల్లా పేదలకు పంపిణీ: పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పేదలకు సుమారు 85 వేల ఇండ్లను ఈ ఏడాది డిసెంబర్‌నాటికి పంపిణీ చేయనున్నట్టు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు. ఇందులో 75 వేల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కాగా, మరో పదివేలు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇండ్లు ఉన్నట్టు తెలిపారు. నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో.. తాగునీరు, విద్యుత్‌, ఇతర మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై బుధవారం మంత్రి కేటీఆర్‌ బుద్ధభవన్‌లోని ఈవీడీఎం కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఒకటి రెండురోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌లోని పేదలకు లక్ష డబుల్‌బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నట్టు, ఇందుకు రూ. 9,700 కోట్లు వెచ్చిస్తున్నట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పేదలకు పూర్తి ఉచితంగా ఇండ్లను పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు వేల ఇండ్ల చొప్పున పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన వెల్లడించారు.


logo