శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 08:24:19

నిదురపోవా తల్లీ!

నిదురపోవా తల్లీ!
  • 71% మంది మహిళలకు కునుకే బంగారం
  • ఇంటిపనులతో తీరికలేకపోవడమే కారణం
  • పగలు నిద్రించేందుకు సమయం కావాలి
  • సర్వేలో గృహిణుల మనోగతం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సూర్యోదయానికి ముందు లేచేది ఆమె! సుర్యాస్తమయం తర్వాత సైతం పనిచేసేది ఆమె! కోడికూయక ముందే వాకిలి ఊడ్చి, అలుకు చల్లుతూ.. బడికెళ్లే పిల్లలకు వండిపెట్టడం.. ఒకే చేత్తో రెండు పనులు ఆమెకే సొంతం. భర్తకు బాక్స్‌ పెట్టి బట్టలు ఉతికిపెట్టి, అవి ఆరాక ఇస్త్రీచేసి పెట్టే ఇల్లాలికి ఇసుమంతైనా తీరిక ఉండటం లేదు. అలసిపోకుండా అందరికి అన్నీ సర్దిపెట్టే ఆమెకు నిద్ర కరువైంది! ఇంటిని మొత్తాన్ని కంట్రోల్‌ చేసే ‘హోం మినిస్టర్లు’ కంటి నిండా కునుకుతీయడంలేదు. పురుషులతో పోలిస్తే మహిళలు 71 శాతం మంది తక్కువగా నిద్రపోతున్నారు. 

కొరవడిన లింగ సమానత్వం 

హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై నగరాల్లో 1,175 మందిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వంటచేయటంతోపాటు ఇంటిపనులతో మహిళలకు తీరిక ఉండటంలేదని, బట్టలు ఉతుకడంతోనే మహిళల కాలమంతా గడిచిపోతున్నదని మహిళలు వాపోయారు. సమాజంలో లింగ సమానత్వం కొరవడటమే కారణమని సర్వేలో తేలింది. ‘షేర్‌ ది లోడ్‌' పేరుతో నిర్వహించిన ప్యానల్‌చర్చలో ప్రముఖ డిటర్జెంట్‌ తయారీదారు ‘ఏరియల్‌' ఈ వివరాలను మీడియాకు విడుదలచేసింది. సినీనిర్మాత తాహిరా కశ్యప్‌ ఖురానా, డాక్టర్‌ నందితాషా, జోసిపాల్‌, శరత్‌వర్మ తదితరులు చర్చలో పాల్గొన్నారు. భర్తలు బాధ్యత పంచుకొని భార్యలకు సహరించాలని పిలుపునిచ్చారు. 

బట్టలు ఉతుకడమే మహిళల పని?

భర్త కంటే తక్కువగా నిద్రిస్తున్నామని 71 శాతం మంది, రోజంతా పనిచేసి అలసిపోతున్నామని ప్రతి పదిమందిలో ఆరుగురు తెలిపారు. పగటిపూట నిద్రించేందుకు కాస్త సమయం అవసరమని సర్వేలో సగం మంది అభిప్రాయపడ్డారు. పిల్లలను బడికి పంపాక ఇంట్లో ఎదురయ్యే పనులే భారమవుతున్నాయని చాలామంది మహిళలు చెప్పారు. బట్టలు ఉతుకడాన్ని మహిళల పనిగా 79 శాతం మంది పురుషులు భావిస్తున్నారు. కేవలం 35 శాతం మంది భర్తలే ఇంటిపనుల్లో భార్యలకు సహకరిస్తున్నారు.


logo