గురువారం 28 మే 2020
Telangana - May 05, 2020 , 00:48:33

మాజీ ఎంపీ కవిత చొరవతో స్వరాష్ర్టానికి..

మాజీ ఎంపీ కవిత చొరవతో స్వరాష్ర్టానికి..

  • మహారాష్ట్ర, ఏపీ నుంచి 669 మంది విద్యార్థుల తరలింపు
  • హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారుల సూచన

నిజామాబాద్‌/జగిత్యాల ప్రతినిధి/అలంపూర్‌/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ కారణంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో చిక్కుకున్న 669 మంది తెలంగాణ విద్యార్థులు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో స్వస్థలాలకు చేరుకున్నారు. జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన 55 విద్యార్థులు మహారాష్ట్రలోని అమరావతిలో వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలో శిక్షణ పొందేందుకు వెళ్లారు. అక్కడ కరోనా వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో సమస్యను కవితకు ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆమె విద్యార్థులకు భోజనం, రవాణా సదుపాయం కల్పించారు. వారంతా సోమవారం సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచేలా అధికారులు ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఎలాగైనా ఇంటికి వెళ్లాలనే ఆలోచనతో 40 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చామని, పోలీసులు అడ్డుకొని క్వారంటైన్‌ చేశారని తెలిపారు. 

అక్కడ బిక్కుబిక్కుమంటూ గడిపిన తాము సమస్యను ట్విట్టర్‌ ద్వారా కవితక్కకు విన్నవించడంతో వెంటనే రెండు బస్సులను ఏర్పాటుచేసి ఇంటికి తీసుకొచ్చారని ఆనందం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌, కామారెడ్డితోపాటు ఇతర జిల్లాలకు చెందిన 614 మంది విద్యార్థులు గతేడాది ఏపీలోని నంద్యాల పట్టణంలో బ్యాంకు కోచింగ్‌ కోసం వెళ్లారు. లాక్‌డౌన్‌తో వీరంతా అక్కడే చిక్కుకున్నారు. విషయం మాజీ ఎంపీ కవిత దృష్టికి రావడంతో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవికిశోర్‌రెడ్డితో మాట్లాడి విద్యార్థులు తెలంగాణకు వచ్చేలా ఏర్పాట్లుచేయించారు. ఏపీ సీఎం జగన్‌ ఆదేశాల మేరకు 614 మంది విద్యార్థులు 21 ఆర్టీసీ బస్సుల్లో స్వరాష్ర్టానికి తరలించారు. సోమవారం రాత్రి జోగుళాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్‌ ప్లాజా వద్ద విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరంతా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.


logo