మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:15:33

వైరస్‌ బాధితుల్లో యువతే 65%

వైరస్‌ బాధితుల్లో యువతే 65%

  • వీరంతా 20 నుంచి 50 ఏండ్లలోపువారే
  • మరణాల్లో 46.13% వైరస్‌ ప్రభావం
  • మిగతా 53.87% ఇతర వ్యాధుల వల్లే
  • రాష్ట్రంలో పెద్ద మొత్తంలో కంటైన్మెంట్‌ జోన్లు
  • ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో బెడ్స్‌ వివరాలు
  • 59 పేజీల సమగ్ర హెల్త్‌ బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ శాతం యువతే ఉన్నట్టు స్పష్టమవుతున్నది. దాదాపు 65 శాతం కంటే ఎక్కువ కేసుల్లో 20 నుంచి 50 ఏండ్లలోపువారే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు సంభవించిన మరణాల్లో కరోనా వల్ల 46.13 శాతం ఉండగా, ఇతర వ్యాధుల కారణంగా 53.87 శాతం ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. 20 నుంచి 50 ఏండ్లలోపువారే 65 శాతం వరకు ఉండటం గమనార్హం. 11 నుంచి 20 ఏండ్లలోపువారు 3.4 శాతం, 70 ఏండ్లకు పైబడినవారు 3 శాతం వరకు ఉన్నారు. మొత్తం కేసుల్లో 65.6 శాతం పురుషులు ఉండగా, 34.4 శాతం మహిళలు ఉన్నట్టు మంగళవారం 59 పేజీలతో కూడిన మెడికల్‌ బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ప్రభుత్వ,           ప్రైవేటులో వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాలు, చికిత్స అందించే దవాఖానలు, అందుబాటులో ఉన్న పడకలు, రాష్ట్రంలో ఉన్న కంటైన్మెంట్‌ జోన్ల వివరాలను ప్రచురించింది. ప్రతి ఒక్కరి ప్రాణాలు రక్షించేందుకు వైద్య సామగ్రి, ఔషధాలు, పడకలు, ఇతర అన్ని సదుపాయాలు సిద్ధంచేసినట్టు తెలిపింది.  

ఖాళీగా 14,839 పడకలు

ప్రభుత్వ పరిధిలో 57 దవాఖానల్లో, 55 ప్రైవేటు దవాఖానల్లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కలిపి మొత్తం 17,081 పడకలు ఉన్నాయి. వీటిలో 2,242 పడకలు భర్తీ కాగా, 14,839 ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఐసొలేషన్‌, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్స్‌ ఉన్నా యి. 16 ప్రభుత్వ ల్యాబ్‌లలో, 23 ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా, ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధజిల్లాల్లో ఏర్పాటుచేసిన 320 నిర్ధారణ కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు దవాఖానల్లో 4,497 పడకలు ఉండగా, ఇందులో 3,032 భర్తీ అయ్యాయి. 1,465 పడకలు ఖాళీగా ఉన్నాయి.  

జిల్లాల్లో కంటైన్మెంట్‌ జోన్లు

ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఆయా ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి వైరస్‌ వ్యాప్తిని అరికడుతున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 92 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటుచేయగా, ఇతర జిల్లాల్లో కలిపి వెయ్యికి పైగా కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నట్టు వివరించింది. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వివిధశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. లక్షణాలు ఉన్నవారిని త్వరగా గుర్తించడం, అవసరమైనవారికి సత్వరం చికిత్స అందించి కాపాడుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా కృషిచేస్తున్నది.

ప్రైవేటు ల్యాబ్స్‌, దవాఖానలపై 

ఫిర్యాదుకు వాట్సాప్‌ నంబర్‌

9154170960logo