గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 01:34:49

రోజుకు 64 వేల టెస్టులు

రోజుకు 64 వేల టెస్టులు

  • మందులు అందుబాటులో ఉంచండి
  • సమీక్షలో మంత్రి ఈటల ఆదేశం
  • కరోనా తీవ్రత తగ్గినా ముప్పు పోలే
  • 3.8 శాతానికి తగ్గిన వైరస్‌ పాజిటివిటీ
  • వైద్యారోగ్యశాఖ అధికారుల వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రోజుకు 64 వేల కరో నా పరీక్షలు నిర్వహించాలని, పీహెచ్‌సీ స్థాయివరకు అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కే భవన్‌లో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పరిస్థితి, చలికాలంలో కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత నిల్వ, సరఫరా తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిందని, అయినా ఇంకా ముప్పు తొలిగిపోలేదని తెలిపారు. ప్ర జలు మరో రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. 

మరణాలు కూడా తగ్గాయన్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీ పడ టం లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు 51 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. పాజిటివ్‌ రేటు 6 నుంచి 3.8 శాతానికి తగ్గిందని వివరించారు. రాష్ట్రంలోని 62 ప్రభుత్వ దవాఖానల్లో 1,600 వెంటిలేటర్స్‌ అందుబాటులో ఉన్నాయని ఆక్సిజన్‌ కొరత లేదన్నారు. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే కేసులు తక్కువగా ఉన్నాయని తెలిపారు. సెకండ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గాంధీ దవాఖానలో ఇతర వైద్య సేవలు కూడా అందిస్తామని చెప్పారు. సమీక్షలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

94.86 శాతానికి చేరిన రికవరీ రేటు 

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రికార్డుస్థాయికి చేరింది. తెలంగాణలో 94.86 శాతంగా నమోదుకాగా, దేశంలో 93.6 శాతంగా రికార్డయ్యింది. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు శుక్రవారం నాటికి 50.92 లక్షలు దాటినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఒక్కరోజే 42 వేల టెస్టులు చేయగా, ఇందులో 39,325 ప్రభుత్వ ల్యాబ్‌లలో, 2,752 ప్రైవేటు ల్యాబ్‌లలో నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 161 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 91, రంగారెడ్డి 75 కేసులు వెలుగుచూశాయి.

వివరాలు
శుక్రవారం 
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
925
2,62,653
డిశ్చార్జీ అయినవారు
1,367
2,49,157
మరణాలు
31,426
చికిత్స పొందుతున్నవారు
-12,070