శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 09:53:08

కరోనా భయం.. రామంతాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య

కరోనా భయం.. రామంతాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌ : కరోనా భయం ప్రతిఒక్కరిని వెంటాడుతోంది. కరోనా తమకు సోకిందనే భయంతో కొందరు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో శనివారం ఉదయం చోటు చేసుకుంది. వాసిరాజు కృష్ణమూర్తి(60) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి రామంతాపూర్‌లోని వీఎస్‌ అపార్ట్‌మెంట్‌లో(ప్లాట్‌ నంబర్‌ 303) నివాసం ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా వాసిరాజు ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడు.

ఈ క్రమంలో తరుచూ ఆయాసం రావడంతో తనకు కరోనా సోకిందేమోనని ఆయన భయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని కింగ్‌ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. కరోనా లక్షణాలు లేవని వైద్యులు చెప్పడంతో ఇంటికి తిరిగి వచ్చారు. అయినప్పటికీ వాసిరాజు ఆందోళన చెందుతుండటంతో.. గాంధీ ఆస్పత్రికి వెళ్దామని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. శనివారం ఉదయం గాంధీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న క్రమంలో వాసిరాజు.. తమ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo