e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 19, 2021
Home టాప్ స్టోరీస్ 3 నదులు.. 6 లక్షల ఎకరాలు

3 నదులు.. 6 లక్షల ఎకరాలు

  • త్రివేణి సంగమం సూర్యాపేట
  • కరువు నేలపై కృష్ణా, గోదావరి, మూసీ నదుల పరవళ్లు
  • నాలుగేండ్లలో మూడింతలు పెరిగిన సాగు విస్తీర్ణం
  • 2018కు ముందు 2.50 లక్షల ఎకరాలు
  • నేడు 6.18 లక్షల ఎకరాలు

సూర్యాపేట, సెప్టెంబర్‌ 19 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా త్రివేణి సంగమమైంది. గతంలో జిల్లాలో మూడోంతుల భూమి పడావు పడి ఉండగా, నేడు కృష్ణా, గోదావరి, మూసీ నదులు పరవళ్లు తొక్కుతుండటంతో పచ్చని మాగాణంగా మారింది. జిల్లా జలకళను సంతరించుకోవడంతో దశాబ్దాలుగా నీటి చుక్కకు నోచుకోని బీడు భూములకు మహర్దశ పట్టింది. వెరసి మూడేండ్లలో సాగు విస్తీర్ణం మూడింతలు పెరిగింది. ఓ పక్క నాగార్జునసాగర్‌ కాల్వ ద్వారా 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుండగా.. సీఎం కేసీఆర్‌ కలల ప్రాజెక్టు అయిన కాళేశ్వరంతో 2.93 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. మరోవైపు మూసీ నదితో 25 వేల ఎకరాలు సాగవుతున్నది. మొత్తంగా 6.18 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతున్నది. జిల్లావ్యాప్తంగా 6.21 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, 2018కి ముందు వరితోపాటు ఇతర పంటలు కలిపి 2.50 లక్షలకు మించి సాగుకు నోచుకోకపోయేది. నేడు జిల్లాలో పారుతున్న మూడు నదులతో ఏకంగా 6.18 లక్షల ఎకరాలు సాగవుతుండటం గమనార్హం. గతంలో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు సాగునీరు లేక దాదాపు 70 శాతానికి పైగా వ్యవసాయ భూములు బంజరులుగా దర్శనమిచ్చేవి. నేటి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది.

నాగార్జునసాగర్‌ కాలువ ద్వారా..
నాగార్జునసాగర్‌ ఆయకట్టు అయిన హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గాల్లో సుమారు 2.55 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సాగర్‌ కాలువ కింద ఉన్న లిఫ్ట్‌లకు నిధులు మంజూరు అయ్యాయి. ఆధునీకరణతో 45 వేల ఎకరాలు స్థిరీకరణ జరిగింది. మొత్తం ఆయకట్టు 3 లక్షల ఎకరాలకు చేరింది.

- Advertisement -

మూసీ ఆయకట్టు..
సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించే మూసీ ప్రాజెక్టును నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టే లీకేజీల రూపంలో దిగువకు వెళ్లేవి. ఏడాదిలో ఒక్క పంటకు అది కూడా ఆరుతడి పంటలు 16 వేల ఎకరాలకు మించి ఏనాడూ సాగు కాలేదు. మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో సీఎం కేసీఆర్‌ రూ.20 కోట్లు మంజూరు చేయగా ప్రాజెక్టుకు కొత్త గేట్లు అమర్చారు. నేడు ఏడాదిలో రెండు పంటలకు 40 వేల ఎకరాల భూమి సాగవుతున్నది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 25 వేల ఎకరాల వరకు నీరందుతున్నది.

కాళేశ్వరం నుంచి గోదావరి..
కాళేశ్వరం పూర్తితో గోదావరి జలాలు సూర్యాపేటకు చేరుకున్నాయి. దీంతో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని 2.40 లక్షల ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు అందుతున్నది. చెరువులు, కుంటలు నింపడంతో మరో 53 వేల ఎకరాలు స్థిరీకరణ జరిగి మొత్తం 2.93 లక్షల ఎకరాలకు నీరందుతున్నది. ఇలా సూర్యాపేట జిల్లాలో ముచ్చటగా మూడు నదులు ప్రవహిస్తుండగా అనతి కాలంలోనే బీడుభూములన్నీ సాగులోకి వచ్చాయి. సాగు మూడింతలు పెరిగింది.

నీళ్లు వస్తయని అనుకోలే
మా పొలాలకు నీళ్లు వస్తయని కలలో కూడా అనుకోలేదు. కేసీఆర్‌ సార్‌ పుణ్యమా అని గోదావరి నీళ్లతో నాకు ఉన్న 4 ఎకరాల పొలం పారుతున్నది. ఎస్సారెస్పీ కాలువ నా పొలం మధ్యలోంచి పోతుంది. రెండేండ్ల నుంచి రెండు పంటలకు సరిపోను నీళ్లు వస్తున్నయి. గోదావరి నీళ్లను మళ్లించి మా బీడుభూములను సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్‌ పదికాలాలపాటు చల్లగా ఉండాలి. – దోమల బాలమల్లు, రైతు, నాగారం బంగ్లా, నాగారం మండలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement