చేవెళ్లలో బోర్వెల్ను ఢీకొన్న ఇన్నోవా.. ఆరుగురు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఇవాళ ఉదయం ఇన్నోవా కారు ఓ బోర్వెల్ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. తాడ్బండ్ నుంచి మహబూబ్నగర్ వెళ్తున్న ఇన్నోవా కారు చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్ శివారులోని మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న బోర్వెల్ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా ఆరుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు సికింద్రాబాద్లోని తాడ్బండ్కు చెందిన అసిఫ్ఖాన్, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభానుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.