సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 06:36:31

6న చార్మినార్‌ వద్ద 5కే, 2కే రన్‌..

6న చార్మినార్‌ వద్ద 5కే, 2కే రన్‌..

హైదరాబాద్ : మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన షీ టీమ్స్‌ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. మహిళా దినోత్సవంతో పాటు  షీ టీమ్స్‌ ఐదేండ్లు పూర్తిచేసున్న సందర్భంగా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో మహిళా భద్రతకు సంబంధించిన పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని సీపీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ నెల 6న చార్మినార్‌ వద్ద ఉదయం 5.30 గంటలకు షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5కే, 2కే రన్‌కు సంబంధించిన పోస్టర్‌, టీ షీర్ట్స్‌, మెడల్స్‌ను సీపీ అంజనీకుమార్‌, అదనపు కమిషనర్లు అనిల్‌కుమార్‌, చౌవాన్‌, జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, రమేష్‌రెడ్డిలతో కలిసి సోమవారం కమిషనరేట్‌ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ చార్మినర్‌ వద్ద జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి, మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి  ముఖ్య అతిధులు హాజరవుతున్నారని, మహిళలు, యువతులు అధిక సంఖ్యలో రన్‌లో పాల్గొవాలని సూచించారు. అదే రోజు సాయంత్రం కోఠి ఉమెన్స్‌ కాలేజీలో ఈస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ రమేష్‌రెడ్డి నేతృత్వంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. షీ టీమ్స్‌కు ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో 90  మందిని రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసిందని, 270  మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారని సీపీ వివరించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ముందుకెళ్తుందని ఆపదలో ఉన్న మహిళలు డయల్‌ 100, హాక్‌ ఐ, అందులో ఉన్న ఎస్‌వోఎస్‌ బటన్‌లు ఉపయోగించుకోవాలన్నారు. రన్‌లో పాల్గొనే వారు తమ పేర్లను హాక్‌భవన్‌లోని భరోసా కేంద్రంలో 5వ తేదీన నమోదు చేసుకొవాలని, ఇదంతా ఉచితమేనని సీపీ సూచించారు.  


logo