బుధవారం 03 జూన్ 2020
Telangana - May 13, 2020 , 19:38:11

59 యేళ్ళ రవీంద్రభారతిపై లఘు చిత్రం

59 యేళ్ళ రవీంద్రభారతిపై లఘు చిత్రం

హైదరాబాద్‌ నగరంలోని సాంస్కృతిక కార్యకలాపాల కోసం ఒక ప్రత్యేక వేదిక కావాలని ఆ భవన నిర్మాణానికి మార్చి 23 1960లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి శంకుస్థాపన చేశారు. దాని నిర్మాణం పూర్తై 11వ తేదీ మే 1961లో అప్పటి దేశ ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా భవనాన్ని ఆవిష్కరించారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శత జయంత్యుత్సవాలు ఆ భవనం పూర్తైన సంవత్సరంలోనే రావడంతో ఆ సాంస్కృతిక వేదికకు ‘రవీంద్ర భారతి’ అని నామకరణం చేశారు. ఆ రవీంద్రభారతిని నిర్మించి ఈ సంవత్సరం మే 11వ తేదీకి సరిగ్గా 59 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త, కళాకారుడు వనపట్ల సుబ్బయ్య నాటి పాలకుల చేతుల్లో రవీంద్రభారతి, ప్రస్తుతం దాని తీరూ తెన్నులు, సాంస్కృతిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా రచన చేసి, రంగస్థల కళాకారుడు, సినీ దర్శకుడు రమేష్‌ కిషన్‌ వ్యాఖ్యానంతో ప్రత్యేక వీడియోను చిత్రించి ఆవిష్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం, సామాజిక మాధ్యమాలు, యూ ట్యూబ్‌ల్లో సందడి చేస్తోంది. 

      ఈ 59 యేళ్లలో ఎన్నెన్నో కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినయి. వనపట్ల సుబ్బయ్య ఈ 59 యేళ్ల రవీంద్ర భారతి ప్రస్థానంపై తన కలాన్ని కదిలించి మంచి కవితా పూర్వకమైన రచన చేశారు. ‘ఉమ్మడి ఆంధ్ర మిన్నాగుల పడగ నీడల్లో గేటు దగ్గరే గెంటేయబడ్డోళ్లం.. అక్కడే ఉన్న మారేడు చెట్టుకింద కూర్చోని వలవలా విలపిస్తూ కళ్లు నల్చుకుంటూ వచ్చిన తోవలోనే మరలి పోయేటోళ్లం. మాది మాగ్గాకుండా పోతుందనే బాధతో మనసులోనే కుదేలుపడ్డోళ్లం.. గా సీమాంధ్ర పాలనలో మాది మాగ్గాకుండా పోతోందని మనసులోనే కుదేలు పడ్డోళ్లం. ఇప్పుడు రవీంద్రభారతి.. కవీంద్రభారతి.. తెలంగాణ తల్లికి సకల సాహిత్య సుధా హారతి.. మనందరికీ చిరునామా.. తెలంగాణ భారతి.. ఈ.. రవీంద్రభారతి. ఈ వేదిక కొత్త చరిత్రకు పునాది.. కొత్త కవులకు ఉగాది.. వివిధ కళారూపాల కళాకారులకు ఈ వేదిక ఒక ఇలవేల్పు’ అని నాటి నుంచి నేటి వరకు గల పోకడలను వర్ణిస్తూ సుబ్బయ్య తాను చూసిన రవీంద్రభారతిని గురించి, దాని ప్రస్తుత వైభవం గురించి ఈ వీడియోలో ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌ వేదికలో ఎంతో మంది కళాకారులను, సాహితీవేత్తలను ఈ వీడియో అలరిస్తోంది. 


logo