మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 01:49:11

తెలంగాణలో 55 రకాల వైరస్‌

తెలంగాణలో 55 రకాల వైరస్‌

  • దేశవ్యాప్తంగా 198 విభిన్న రూపాల్లో..
  • చైనా, యూరప్‌ వైరస్‌లే మహా డేంజర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మాయలమరాఠిలా మారుతున్నది. రూపాలు మార్చుతూ, మన దృష్టి ఏమార్చుతూ ఆటలాడుకుంటున్నది. పరివర్తనం చెందుతూ ఊసరవెల్లిలా వ్యవహరిస్తున్నది. కంటికి కనిపించని ఈ వైరస్‌ దేశవ్యాప్తంగా మొత్తం 198 విభిన్న రూపాల్లో సంచరిస్తున్నది. ఒక్క తెలంగాణలోనే 55 రకాలుగా పరివర్తనం చెందింది. జువాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) శాస్త్రవేత్తలు దాదాపు 400 జన్యువులను పరీక్షించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కరోనా అత్యధిక జన్యుమార్పులకు గురైన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. తొలి స్థానంలో గుజరాత్‌ ఉంది. ఆ రాష్ట్రంలో 60 రకాల కరోనా వైరస్‌లను శాస్త్రవేత్తలు గుర్తించగా గాంధీనగర్‌లోనే 13 రకాల వైరస్‌లు బయటపడ్డాయి.

ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లోనూ వైరస్‌ రూపాలను మార్చుకున్నది. మార్చి తొలి వారం, మే చివరి వారంలో వివిధ జన్యువులను పరీక్షించగా ఢిల్లీలో 39, మహారాష్ట్ర, కర్ణాటకల్లో 15 రకాల విభిన్న రూపాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చైనా, యూరప్‌, గల్ఫ్‌ దేశాల నుంచి కరోనా భారత్‌లోకి వచ్చిందని.. అందులో చైనా, యూరప్‌ నుంచి వచ్చిన వైరస్‌లే మహా డేంజర్‌ అని జెడ్‌ఎస్‌ఐ కోల్‌కతా విభాగం డైరెక్టర్‌ కైలాశ్‌ చంద్ర వెల్లడించారు. యూరప్‌లో తొలిసారి ఇటలీలో కరోనాను గుర్తించారని, అదే యూరప్‌లో అంత దారుణంగా విజృంభించడానికి కారణమైందని వివరించారు. ఇక, ఇరాన్‌, దుబాయ్‌ నుంచి వచ్చిన కరోనా వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉందని తెలిపారు. కరోనా వైరస్‌ ప్రవర్తనను తెలిపేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

 రక్తనాళాలపై కరోనా దెబ్బ 

  • నిమ్స్‌ డాక్టర్‌ పరంజ్యోతి

కరోనా వైరస్‌ శ్వాసకోశ వ్యవస్థపైనే కాకుండా రక్తనాళాలపై కూడా ప్రభావం చూపుతున్నదని నిమ్స్‌ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ పరంజ్యోతి తెలిపారు. కరోనా వల్ల మరణిస్తున్న వారిలో ఇతర అవయవాలు కూడా దెబ్బతినడం వైద్యుల అనుమానాలకు కారణంగా కనిపిస్తున్నదని వెల్లడించారు. కొందరు రోగుల్లో వైరస్‌ సోకిన కొన్ని రోజుల్లోనే ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వైరస్‌ రక్తనాళాలపై దాడి చేయడంవల్ల రక్తం గడ్డకట్టి గుండె, కిడ్నీలు విఫలమవుతాయని తెలిపారు. ఈ క్రమంలో రోగికి గుండెపోటు, మెదడు దెబ్బతినడం, పక్షవాతం, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినడం వంటి సంభవిస్తాయన్నారు. 85శాతం మంది కరోనా బాధితుల్లో కనీస లక్షణాలు కూడా కనిపించకపోవడం శుభపరిణామమని అంటున్నారు. రోగనిరోధశక్తి వారిని రక్షిస్తుందని పేర్కొన్నారు. మిగిలిన 15 శాతం కేసులలో 2.5 శాతం మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు.


logo