ఆదివారం 07 జూన్ 2020
Telangana - Mar 31, 2020 , 19:02:20

ఉమ్మడి నల్లగొండవాసులు 54 మంది క్వారంటైన్‌కు తరలింపు

ఉమ్మడి నల్లగొండవాసులు 54 మంది క్వారంటైన్‌కు తరలింపు

నల్లగొండ : మర్కాజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 54 మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 31 మంది నల్లగొండ జిల్లా వాసులు కాగా 12 మంది యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందినవారు అదేవిధంగా మరో 11 మంది సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ప్రాథమిక వైద్య పరీక్షల నిమిత్తం వీరిని పోలీసులు, వైద్య సిబ్బంది సహాయంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికి కరోనా లక్షణాలు లేకపోవడంతో నల్లగొండలోని కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంచారు. 

నల్లగొండ జిల్లా వైద్యారోగ్య అధికారి డా.కొండల్‌రావు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సూర్యాపేట వాసులను ఇంమాపేట సెంటర్‌లో క్వారంటైన్‌లో ఉంచారు. వీరితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితిపై మంత్రి జగదీష్‌ రెడ్డి మూడు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో 54 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ చర్యలకు ప్రజలు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సోషల్‌ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ భవనంలో ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో సుమారు 1500 నుంచి 1700 మంది వరకు పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు హాజరైన పలువురికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రార్థనలకు హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి.


logo