గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 19:15:05

500 మంది ఖైదీలు విడుదల

500 మంది ఖైదీలు విడుదల

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని వివిధ జైళ్ల నుంచి 500 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 61 మంది మహిళలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో జైళ్లలో ఖైదీల సంఖ్య, సామర్థ్యం ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకొనేందుకు ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామచందర్‌రావు నేతృత్వంలో హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, జైళ్లశాఖ డీజీ రాజీవ్‌ త్రివేది, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డిలతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. 

ఈ కమిటీ నిర్ణయం మేరకు నిబంధనలుకు అనుగుణంగా 200 మంది ఖైదీలను విడుదల చేసినట్టు సమాచారం. మరో 300 మంది బెయిల్‌పై విడుదలైనట్టు తెలిసింది. ఏడు వేల మంది పట్టే సామర్థ్యం ఉన్న రాష్ట్రంలోని జైళ్లలో మార్చి 22 వరకు 5,700 మంది ఖైదీలు ఉన్నారు. సామర్థ్యం కంటే తక్కువ మంది ఉండటంతో మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటిస్తూ ఖైదీలంతా సురక్షితంగా ఉన్నట్టు జైళ్లశాఖ వర్గాలు తెలిపాయి.


logo