బుధవారం 08 జూలై 2020
Telangana - May 25, 2020 , 01:35:20

మనోళ్లు తిరిగొస్తున్నారు

మనోళ్లు తిరిగొస్తున్నారు

  • వివిధరాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చిన 1.10 లక్షలమంది
  • కీలకంగా వ్యవహరించిన సచివాలయంలోని కంట్రోల్‌రూమ్‌
  • ఒక్కరోజే 50 వేలమంది వలస కార్మికుల తరలింపు: సీఎస్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న 1.10 లక్షల మంది తెలంగాణ బిడ్డలు స్వస్థలాలకు తిరిగొచ్చారు. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి 40 వేల మంది, మహారాష్ట్ర నుంచి 29 వేలు, రాజస్థాన్‌ నుంచి 11 వేలు, తమిళనాడు నుంచి 10 వేలు, కర్ణాటక నుంచి 6 వేల మందితోపాటు జమ్ముకశ్మీర్‌, సిక్కిం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం తదితర ప్రాంతాల నుంచి పలువురు తిరిగొచ్చారు. అత్యల్పంగా నాగాలాండ్‌ నుంచి ఇద్దరు వచ్చారు. వివిధ రాష్ర్టాల్లో చిక్కుకున్నవారిని ఆదుకునేందుకు లాక్‌డౌన్‌ నుంచి సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేశారు. దీన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు రాహుల్‌బొజ్జా, చిరంజీవులు పర్యవేక్షిస్తున్నారు. మరికొంతమంది అధికారులతోపాటు 200 మంది సిబ్బంది 24 గంటలు షిఫ్టులవారీగా పనిచేస్తున్నారు. కంట్రోల్‌రూమ్‌కు కేటాయించిన 040-23450624 నంబర్‌కు 32 హంటింగ్‌ కాల్స్‌ సౌకర్యం ఉన్నది. నంబర్‌కు ఒకేసారి 32 మంది కాల్‌చేసినా సమాధానం ఇస్తున్నారు. వారి వివరాలు రాసుకొని, పరిశీలించి అనుమతిపత్రాలు తయారుచేసి, వాట్సాప్‌ ద్వారా పంపిస్తారు. ఇప్పటివరకు కంట్రోల్‌ రూమ్‌ జారీచేసిన 20 వేల పాస్‌ల ద్వారా 90 వేలమంది, పోలీసులు ఇచ్చిన ప్రత్యేక అనుమతిపత్రాల ద్వారా మరో 20 వేలమంది వివిధ రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చారు. కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌కు సాధారణంగా రోజుకు 2 వేలకాల్స్‌ వరకు వస్తున్నాయి. ఈనెల 19న అత్యధికంగా 3,500 కాల్స్‌ వచ్చాయి. దీనికి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ నిత్యం సూచనలు చేస్తున్నారు.

128 రైళ్ల ద్వారా ఉచితంగా పంపిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చుతో వివిధ రాష్ర్టాల వలస కూలీలను శరవేగంగా స్వస్థలాలకు పంపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మే 1 నుంచి ఆదివారం వరకు 128 రైళ్లలో 1.58 లక్షల మంది వివిధ రాష్ర్టాల వలస కూలీలు ఉచితంగా గమ్యస్థానాలకు తరలించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.13.15 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు శనివారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 40 రైళ్ల ద్వారా దాదాపు 50 వేలమంది వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపించామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పశ్చిమబెంగాల్‌ మినహా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల తరలింపు దాదాపు పూర్తయిందని పేర్కొన్నారు. ఇంకా ఎవరైనా మిగిలుంటే ఒకటి లేదా రెండు రైళ్ల ద్వారా పంపించడానికి చర్యలు చేపడుతామన్నారు. కార్మికులను బస్సుల్లో రైల్వేస్టేషన్‌కు తరలించి, ఒక్కో కార్మికుడికి రెండు ఆహార ప్యాకెట్లు, మూడు లీటర్ల మంచినీళ్లు, పండ్లను ప్రభుత్వ ఖర్చుతోనే అందిస్తున్నామని వివరించారు. వలస కార్మికులను ఆయా రాష్ట్రాలకు తరలించే ప్రక్రియను సాఫీగా పూర్తిచేసిన అధికారులు, రైల్వేశాఖకు సోమేశ్‌కుమార్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

12 గంటల్లో 43 శ్రామిక్‌ రైళ్లు నడిపిన దక్షిణమధ్య రైల్వే

శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అంటే 12 గంటల్లోనే దక్షిణ మధ్య రైల్వే 43 శ్రామిక్‌రైళ్లు నడిపింది. ఇందులో 40 రైళ్లు తెలంగాణలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, ఘట్‌కేసర్‌, లింగంపల్లి స్టేషన్లనుంచి నడిచాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్నిప్రాంతాల నుంచి ఇప్పటివరకు 196 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లు నడువగా.. 2.40 లక్షల వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు చేరుకున్నారు. సమర్థ కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈ రికార్డు సాధించిన రైల్వే సిబ్బందిని జీఎం గజానన్‌ మాల్య ప్రశంసించారు. రాబోయే 10 రోజుల్లో 2,600 శ్రామిక్‌ రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో జోన్‌ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


logo