ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:05

21 నుంచి బడికి 50% టీచర్లు

21 నుంచి బడికి 50% టీచర్లు

  • 20 వరకు వర్క్‌ఫ్రం హోమ్‌.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాఠశాలలు, కాలేజీల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకుల హాజరుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 నుంచి స్కూళ్లు, కాలేజీల్లో గరిష్ఠంగా 50 శాతం సిబ్బందే హాజ రు కావాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనిప్రకారం బోధన, బోధనేతర సిబ్బంది 50 శాతానికి మించకూడదని స్పష్టం చేశారు. అప్పటిదాకా (ఈ నెల 20 వరకు) టీచర్లు, లెక్చరర్లు అందరూ వర్క్‌ ఫ్రం హోమ్‌ చేయాలని సూచించారు. ఈ మేరకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, ఇంటర్మీడియట్‌, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు కంటైన్మెంట్‌ జోన్‌లో లేని స్కూళ్లు, కాలేజీలకు వర్తిస్తాయి. గత నెల 27 నుంచి టీచర్లు, లెక్చరర్లంతా పాఠశాలలు, కళాశాలల్లో విధులకు హాజరవుతున్నారు. తాజా ఆదేశాలతో వారంతా ఇంటి నుంచే పనిచేయనున్నారు. అన్‌లాక్‌-4 మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. గత నెల 29న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాల ప్రకారం.. ఈ నెల 30 వరకు విద్యార్థులకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు మూసే ఉండనున్నాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర నాయకులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు తదితరులు పేర్కొన్నారు..logo