మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 18, 2020 , 01:51:39

వేరుశనగ పరిశోధనకు 50 కోట్లు

వేరుశనగ పరిశోధనకు 50 కోట్లు

  • మంజూరు కోసం కేంద్రానికి మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వేరుశనగ పరిశోధనాకేంద్రం ఏర్పాటుకు రూ.50 కోట్లు మంజూరుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు ఆయన లేఖ రాశారు. తెగుళ్లను మరింతగా తట్టుకొని నిలబడే నాణ్యమైన విత్తనాల ఉత్పత్తికి, ఎగుమతికి అవకాశముండే వేరుశనగ పండించడానికి వనపర్తిలో పరిశోధనాకేంద్రం ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించిందని తెలిపారు. 


విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు, అవసరమైన సదుపాయాలు, ల్యాబ్‌, నూతన భవనం కోసం పెట్టుబడి నిధులు విడుదలచేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో తెలంగాణ వ్యవసాయ స్వరూపం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ప్రపంచంలోనే ఆప్లాటాక్సిన్‌ (విషపూరిత క్యాన్సర్‌కారక పదార్థాలు) లేని వేరుశనగ పంటకు పాలమూరు జిల్లా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఆప్లాటాక్సిన్‌ లేని వేరుశనగకు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్నదని తెలిపారు. దీనినుంచి ఉత్పత్తిచేసే పీనట్‌ బట్టర్‌కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఎక్కువని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా వేరుశనగ దిగుబడి వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి వస్తున్నదని వెల్లడించారు. 


logo
>>>>>>