శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 02:59:30

50.84 లక్షల ఖాతాల్లో రూ.5,294 కోట్లు

50.84 లక్షల ఖాతాల్లో రూ.5,294 కోట్లు

  • ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో రైతుబంధు సొమ్ము జమ
  • కరోనా కష్టకాలంలోనూ అన్నదాతకు అండగా ప్రభుత్వం
  • ఈ నెల 16 వరకు పాస్‌పుస్తకాలున్నవారికి పెట్టుబడిసాయం
  • బ్యాంకు వివరాల్లేని ఐదు లక్షల మందికి ఆలస్యం 
  • సాగుకు ముందే సాయం అందడంపై రైతుల్లో హర్షం

కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం కర్షకుడికి అండగా నిలిచింది.. ముందుగా ప్రకటించిన విధంగా వానకాలం పంటసొమ్మును రైతుల ఖాతాల్లో వేసింది. ఒక్కరోజే రికార్డుస్థాయిలో 50.84 లక్షల మందికి రైతుబంధు సొమ్ము అందజేసింది.. వానకాలం పంటసాయం కింద ఎకరానికి 5 వేల చొప్పున రూ.5,294 కోట్లు జమ చేసింది. ఈ నెల 16 వరకు పాస్‌పుస్తకం ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు అందించింది. ముందుగానే పెట్టుబడి అందడంతో రైతన్న మరింత ఉత్సాహంతో వానకాలం సాగుకు సిద్ధమవుతున్నాడు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అన్నదాతకు ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. 2020-21 ఏడాది వానకాలానికి సంబంధించి ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమచేసింది. కరోనా కష్టకాలంలోనూ రైతన్నకు అండగా నేనున్నానంటూ వెన్నుతట్టి ఆర్థికంగా అండగా నిలిచింది. రికార్డుస్థాయిలో సోమవారం ఒక్కరోజే ఏకంగా 50.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సొమ్ము అందజేసింది. మొత్తం రూ.5,294.53 కోట్ల నిధులను వారి ఖాతాల్లో జమ చేసింది. కరోనా కల్లోలం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైన పరిస్థితుల్లోనూ.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి రైతులకు ఇంత భారీమొత్తంలో సాయమందించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతన్నలో భరోసా నింపారు. 

ఈ ఏడాది రైతుబంధు కోసం రెండు సీజన్లు కలిపి రూ.7వేల కోట్ల చొప్పున ప్రభుత్వం రూ.14 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన విషయం తెలిసిందే. వానకాలం సీజన్‌కు సంబంధించి ఆర్థికశాఖ ఇటీవలే వ్యవసాయశాఖకు మొదటి విడుతగా రూ.5,800 కోట్లు బదిలీచేసింది. బ్యాంకు ఖాతాల వివరాలు సక్రమంగా అందుబాటులోలేని ఐదులక్షల మందికి రైతుబంధు నిధులు అందలేదు. వీరి ఖాతా వివరాలు ఏఈవోలకు అందగానే రైతుబంధు నిధులు జమ చేయనున్నారు. ఏజెన్సీ రైతులకు ప్రభుత్వం ఇచ్చినమాట ప్రకారం గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రైతుబంధు అందించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాదారులైన 63,477 మంది రైతులకూ రూ.82.37 కోట్లు జమచేశారు. 

ఒక్క రోజులో రికార్డు

గతంలో రైతుబంధు నిధులు కొంతమంది రైతులకు ఒకసారి, మరికొంతమందికి మరోసారి ఇలా విడుతలవారీగా ఖాతాల్లో జమఅయ్యేవి. కానీ ఈసారి ఒక్క రోజులోనే దాదాపుగా అర్హులైన రైతులందరికీ రైతుబంధు నిధులను జమ చేయడం విశేషం. దేశ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పువచ్చు. ఈ-కుబేర్‌ టెక్నాలజీతో ఒకేసారి రైతుబంధు నిధులను ఖాతాల్లో జమచేశారు. ఇంత భారీసంఖ్యలో రైతులకు ఒకేసారి అందించినా ఎక్కడా లోపాలు తలెత్తకపోవడం విశేషం. 

రైతన్నల్లో హర్షం

ఇచ్చిన మాట ప్రకారం వానకాలం సాగుకు ముందే పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఇక పెట్టుబడి కోసం ఇతరులపై ఆధారపడకుండా అవసరమైన ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసేందుకు అన్నదాత సిద్ధమవుతున్నారు. దీంతో రాష్ట్రంలో వానకాలం సాగు పనులు మరింత జోరందుకోనున్నాయి. క్లిష్టపరిస్థితుల్లో రైతుబంధు సకాలంలో వస్తుందో?, లేదో? అన్న సం దేహం ఉన్నప్పటికీ.. చెప్పిన సమయానికి సొమ్మును ఖాతాల్లో జమచేసి సీఎం కేసీఆర్‌ మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

అర్హులందరికీ పెట్టుబడి సాయం

అర్హులైన ప్రతిరైతుకు రైతుబంధు సాయం అందిస్తాం. ఇందులో భాగంగానే ఈనెల 16వ తేదీ వరకు పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న ప్రతిరైతుకు పెట్టుబడి సాయం అందించాం. కష్టకాలంలోనూ రైతుబంధు నిధులు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతుల తరఫున కృతజ్ఞతలు. సకాలంలో పెట్టుబడి సాయం అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతును రాజును చేసేందుకు సీఎం కేసీఆర్‌ వ్యవసాయంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. 

- సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి


logo