గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 02:35:33

50 వేలివ్వకపోతే కేసుల్లో ఇరికిస్తా

50 వేలివ్వకపోతే కేసుల్లో ఇరికిస్తా

  • చీటింగ్‌, ఫోర్జరీ కేసుల్లో నిందితులకు బెదిరింపు
  • ఏసీబీకి చిక్కిన గాంధీనగర్‌ ఎస్సై, కానిస్టేబుల్‌

దోమలగూడ: ‘రూ.50 వేలు లంచం ఇవ్వకపోతే మరిన్ని కేసులల్ల ఇరికిస్త’ అంటూ వివిధ కేసుల్లో బెయిల్‌పై వచ్చిన నిందితులను బెదిరించిన ఎస్సై, కానిస్టేబుల్‌ అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. బుధవారం రూ.30 వేలు లంచం తీసుకుంటూ హైదరాబాద్‌ గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై లక్ష్మీనారాయణ.. చీటింగ్‌, ఫోర్జరీ కేసుల్లో గతంలో కొంతమందిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. వారికి షరతులతో కూడిన బెయిల్‌ వచ్చింది. ప్రతి శని, బుధవారాలు స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్తున్నారు. మరిన్ని కేసులు పెట్టి జైలుకు పంపుతానని నిందితులను బెదిరించిన లక్ష్మీనారాయణ.. రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం ఫిర్యాదుదారుడు రూ.30 వేలతో ఎస్సై వద్దకు రాగా.. ఆయన డబ్బు కానిస్టేబుల్‌ నరేశ్‌కు ఇవ్వాలని సూచించాడు. లంచం తీసుకుంటుండగా నరేశ్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోగా, ఎస్సై చెప్తేనే తాను డబ్బు తీసుకున్నానని అతడు చెప్పాడు. విచారణ అనంతరం లక్ష్మీనారాయణ, నరేశ్‌ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో గాంధీనగర్‌ ఎస్‌హెచ్‌వో సుంకరి శ్రీనివాసరావును సీసీఎస్‌కు బదిలీచేశారు. సైబర్‌ క్రైంలో పనిచేస్తున్న మోహన్‌రావుకు గాంధీనగర్‌ ఎస్‌హెచ్‌వో బాధ్యతలను అప్పగించారు.