బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 03, 2020 , 02:39:50

పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తూ..ఐదుగురు దుర్మరణం

పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తూ..ఐదుగురు దుర్మరణం

  • వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోరం.. మృతులంతా పాతికేండ్లలోపు వారే
  • అందరూ పాతికేండ్లలోపు వారే..
  • వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఘోరం
  • అతివేగంతో కారును ఢీకొన్న లారీ!

వరంగల్‌ రూరల్‌, నమస్తే తెలంగాణ:  అంతా స్నేహితులు. ఒక స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. ఆ సంతోషంలో తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కరుగా తమ తమ ఊళ్లలో దిగిపోవాల్సిన ఆ ఐదుగురినీ మృత్యువు కాటేసిం ది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో వరంగల్‌-ములుగు జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఇసుకలారీ.. ఆ కారును ఢీకొనడంతో వారు అక్కడికక్క డే చనిపోయారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయిపోవడంతో వాహనాల వెలుతురులో అతికష్టం మీద పోలీసులు మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. 


మృతులంతా పాతికేండ్లలోపువారే. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌లో ఓ యువకుడి పుట్టినరోజు వేడుకలకు అతడి బంధువు మేకల రాకేశ్‌ (23), స్నేహితులు హన్మకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన కండెల జయప్రకాశ్‌ అలియాస్‌ చందు (23), లష్కర్‌ సింగారానికి చెందిన రోహిత్‌ (20), నర్సంపేటకు చెందిన షేక్‌సాబీర్‌ (19), ములుగుకు చెందిన నరేశ్‌(23) హాజరయ్యారు. వేడుకలు ముగిశాక అర్ధరాత్రి 12.30 గంటలకు కారులో ఇండ్లకు బయలుదేరారు. ముందుగా ములుగులో నరేశ్‌ను దింపాలని నిర్ణయించుకున్నారు. 1.30 గంటల సమయంలో పసరగొండ క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకున్న వారి కారును ఎదురుగా ఇసుకలోడుతో వస్తున్న లారీ ఢీకొన్నది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకులూ మృతిచెందారు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 


కారు నుజ్జునుజ్జుకావడంతో యువకుల మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి. సమాచారం అందగానే పరకాల ఏసీపీ శ్రీనివాస్‌, శాయంపేట సీఐ వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వాహనాల లైట్ల వెలుతురులో బయటకుతీసి, వరంగల్‌ ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించారు. కారును ఢీకొన్న లారీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి ఇసుక లోడుతో హైదరాబాద్‌ వెళ్తున్నదని, ప్రమాదం తరువాత లారీడ్రైవర్‌ దేవి పరారయ్యాడని పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. లారీ యాదాద్రి భువనగిరికి చెందినది కాగా, చెయ్యి విరిగిన డ్రైవర్‌ దేవి భువనగిరిలో ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నామని అన్నారు. దామెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. logo